Revanth Reddy : తెలంగాణలో హుక్కా కేంద్రాలపై కీలక నిర్ణయం
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలను నాలుగో రోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా కీలక బిల్లును మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. తెలంగాణలో హుక్కా కేంద్రాలను నిషేధించే సవరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టాల్సి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి తరపున మంత్రి శ్రీధర్ బాబు ఆ బిల్లును ప్రవేశపెట్టగా అందుకు సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన సభకు మంత్రి శ్రీధర్ బాబు ధన్యవాదాలు తెలిపారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. హుక్కా సెంటర్లపై నిషేధం అవసరమని, యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. యువత ధూమపానానికి అలవాటుపడే అవకాశం ఉందని, పొగ కంటే హు్కా మరింత ప్రమాదకరమని అన్నారు. చాలా మంది చెడు అలవాట్లకు బానిసగా మారుతున్నారని, ముఖ్యంగా అబ్బాయిలు హుక్కా సేవిస్తూ తమ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారని అన్నారు. అందుకే హుక్కా కేంద్రాలను నిషేధించడం ఎంతో ముఖ్యమన్నారు.
యువత, ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం హుక్కా సెంటర్లను శాశ్వతంగా నిషేధిస్తూ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది. దీనిపై సభలో ఎలాంటి చర్చ లేకుండానే అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. దీంతో తెలంగాణలోని హుక్కా సెంటర్లు మూతపడనున్నాయి. హుక్కా నిషేధం అమల్లోకి రావడంతో ఇకపై హుక్కాకు సంబంధించిన ఉత్పత్తులను అమ్మడం, కొనడం నేరంగా పరిగణించబడుతుంది.