Bandi sanjay : నయీం కేసు తవ్వితే అన్ని పార్టీల బండారం బయటపడ్తది - బండి సంజయ్‌

Byline :  Kiran
Update: 2024-01-08 13:15 GMT

ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రభుత్వం అంటూ ప్రజలను మోసం చేయొద్దని బీజేపీ నేత బండి సంజయ్ విమర్శించారు. అప్పు పేరుతో కాలయాపన చేయడం సరికాదని అన్నారు. అప్పుల భారాన్ని ఎలా తీరుస్తారో చెప్పాలని అప్పుడే పెట్టుబడులు వస్తాయని బండి సూచించారు.

నయీం కేసు తవ్వితే అన్ని పార్టీల నేతల బండారం బయటపడుతుందని బండి అన్నారు. ఈ కేసులో బీఆర్ఎస్ నేతల హస్తం ఉందన్న ఆయన.. అసలు నయీం అక్రమ ఆస్తులు, డాక్యుమెంట్లు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ ఆస్తుల్ని బయటకు తీస్తే 2 -3 జిల్లాలు బాగుపడతాయని అన్నారు. డ్రగ్స్ కేసును తిరగదోడి ఎంత పెద్దవాళ్లున్నా బయటకు లాగాలని, 317 జీవోను సవరిస్తారా లేదా చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందన్న కాంగ్రెస్ సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని బండి ప్రశ్నించారు. కాళేశ్వరం అంశాన్ని సీబీఐకు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికున్న అభ్యంతరం ఏంటని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనంటున్న కాంగ్రెస్ దానికి ఆధారాలు చూపాలని బండి డిమాండ్ చేశారు. ఈటలకు, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవన్న ఆయన స్పష్టం చేశారు. అసలు ఈటలకు ఎవరితో విభేదాలు లేవని.. అందరితో కలిసిమెలిసి ఉంటారని అన్నారు. బీఆర్ఎస్ మునిగిన నావ అయితే కాంగ్రెస్ మునిగే నావ అని బండి సటైర్ వేశారు.




Tags:    

Similar News