సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే.. కేసీఆర్పై సీబీఐతో విచారణ జరిపించాలి: Bandi Sanjay

Byline :  Bharath
Update: 2024-02-13 11:41 GMT

తెలంగాణలో జల రాజకీయం సాగుతోన్న క్రమంలో.. మంగళవారం (ఫిబ్రవరి 13) సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులంతా మేడిగడ్డకు వెళ్లారు. మేడిగడ్డ ప్రాజెక్టులో కుంగిన పిల్లర్లను రేవంత్ బృందం పరిశీలించింది. కుంగిన పిల్లర్లపై అధికారులు సీఎం సహా ఎమ్మెల్యేలకు వివరించారు. ఈ క్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆసక్తికర వాఖ్యలు చేశారు. చూసిన బ్యారేజీనే మళ్లీ మళ్లీ ఏం చూస్తారని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. ఇప్పటికే ప్రభుత్వానికి అధికారులు.. మేడిగడ్డ బ్యారేజీపై సమగ్ర నివేదిక అందించారని గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే.. కేసీఆర్పై సీబీఐతో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

ప్రాజెక్టులపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఇరుకున పెడితే.. కేఆర్ఎంబీ అంటూ బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగుతోంది. దీనిపై స్పందించిన బండి.. కృష్ణా జలాల విషయంలో అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం ఆటలాడుతున్నాయని మండిపడ్డారు. వారి పోకడను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఇచ్చిన హామీలను మరిచి, పాలనను కాంగ్రెస్ గాలికొదిలేసిందని బండి ఆరోపించారు. మేడిగడ్డ రిపోర్ట్ ఆధారంగా కేసీఆర్ పై చర్యలు తీసుకోకుండా.. కాంగ్రెస్ కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. దీని ద్వారా కాంగ్రెస్, బీఆర్ఎస్ దోస్తీ బయటపడిందని విమర్శించారు.

Tags:    

Similar News