లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదు - బండి సంజయ్

By :  Kiran
Update: 2024-02-15 10:15 GMT

కాళేశ్వరం అవినీతిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. అన్ని ఆధారాలున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరిని గమనిస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని మళ్లీ రుజువైందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సెంట్రల్ టీం విచారణ జరిపిందన్న బండి.. కాంగ్రెస్ మంత్రులు సైతం వెళ్లి పరిశీలించారని.. మళ్లీ ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. బీజేపీని పక్కదారి పట్టించేందుకు ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.

బీఆర్ఎస్ కు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే కేసీఆర్ మాయమాటలు చెప్పి వారిని అడ్డుకుంటున్నారని బండి విమర్శించారు. కేంద్రంలో మూడోసారి మోడీ అధికారంలోకి రావడం ఖాయమని, ఆ తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని చెబుతూ కేసీఆర్ తన పార్టీ నేతలను మభ్యపెడుతున్నారని అన్నారు. అయితే అది ఎప్పటికీ జరగదని బండి స్పష్టం చేశారు. తెలివున్నోడు ఎవరూ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోడని తేల్చి చెప్పారు. కేంద్రంలో 400 సీట్లతో తాము హ్యాట్రిక్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నప్పుడు రాష్ట్రంలో మూడో స్థానానికి దిగజారిన బీఆర్ఎస్ లాంటి పార్టీతో తాము పొత్తు ఎందుకు పెట్టుకుంటామని అన్నారు.

బీఆర్ఎస్ మునిగిపోయే నావ అన్న బండి సంజయ్.. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ కు ఓటు వేసి మోసపోయామని ప్రజలు అనుకుంటున్నారని, ఈసారి బీజేపీని గెలిపించాలని జనం నిర్ణయించుకున్నారని చెప్పారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 20 నుంచి మార్చి 1 వరకు బస్సు యాత్ర చేపట్టనున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు. బీఆర్ఎస్ మోసాలు, కాంగ్రెస్ అమలు చేయని హామీల గురించి ప్రజలకు వివరించేందుకే ఈ యాత్ర చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.

Tags:    

Similar News