కేసీఆర్ కుటుంబం దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉంది: బండి సంజయ్

Byline :  Bharath
Update: 2023-12-16 13:52 GMT

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను బీఆర్ఎస్ నాయకులు దోచుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ కుటుంబ సభ్యులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎంవోలో పనిచేసిన అధికారుల పాస్ పోర్టులు వెంటనే సీజ్ చేయాలని అన్నారు. బీఆర్ఎస్ నేతలు అధికారం పేరిట ప్రజల సొమ్ము దోచుకుతిన్నారని, బిల్లా మాదిరి మూటలు సర్దుకున్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం విచారణ ప్రారంభిస్తే.. కేసీఆర్‌ కుటుంబం సహా బీఆర్‌ఎస్‌ నేతలంతా విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని.. వాళ్ల పాస్‌పోర్టులు సీజ్‌ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

గత పదేళ్ల పాలనలో వాళ్లు చేసిన అవినీతి భాగోతాలు ఎక్కడ బయటపడతాయనే భయం నెలకొందని బండి అన్నారు. అందుకే వాళ్ల పాస్‌పోర్టులు సీజ్‌ చేయాలని కోరారు. తెలంగాణను బంగారు పళ్లెంలో పెట్టి అప్పగించామని బీఆర్ఎస్ నేతలు చెప్పడం సిగ్గు చేటని మండిపడ్డారు బండి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని గుర్తుచేశారు. దేశమంతా మోదీ హవా నడుస్తోందని, ముచ్చటగా మూడోసారి 350 సీట్లతో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగానే కాదు.. తెలంగాణలోనూ కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉండనుందని తేల్చి చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా గల్లంతవుతుందని అన్నారు. పార్టీ గెలుపే లక్ష్యంగా రానున్న రోజుల్లో కష్టపడి పనిచేయాలని బీజేపీ కార్యకర్తలకు బండి సంజయ్‌ పిలుపు ఇచ్చారు.

Tags:    

Similar News