లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ప్రజలతో మమేకమయ్యేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. మరికొన్ని రోజుల్లోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశముండటంతో నేతలు ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ సైతం సభలు, సమావేశాలు, యాత్రలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో పడింది. ఇందులో భాగంగా పార్టీ సీనియర్ నేత బండి సంజయ్ మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈ నెల 10 నుంచి కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో విజయ సంకల్ప యాత్రకు రెడీ అవుతున్నారు. కేంద్ర పథకాలను జనంలోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంపై తిరిగి కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగనుంది. లోక్ సభ ఎన్నికల వరకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని గ్రామాల్లో పాదయాత్ర చేయనున్న బండి సంజయ్ ప్రజలతో మమేకం కానున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఫిబ్రవరి 10న కొండగట్టు వద్ద పూజలు చేసిన అనంతరం మేడిపల్లి నుంచి యాత్ర మొదలుపెట్టనున్నారు. తొలివిడతలో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో మొత్తం 119 కిలోమీటర్ల మేర బండి సంజయ్ యాత్ర ఉంటుందని సమాచారం. మొదటివిడత యాత్ర రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో ముగియనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో యాత్ర ఏర్పాట్లపై స్థానిక బీజేపీ నేతలతో బండి చర్చించారు.
తొలిరోజు కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేడిపల్లి మండల కేంద్రంలో బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. కొండాపూర్, రంగాపూర్, భీమారం, మన్నేగూడ, బొమ్మెన, దూలూరు, సిరికొండ, కథలాపూర్ వరకు యాత్ర కొనసాగనుంది. యాత్రలో భాగంగా ఒక గ్రామం నుంచి మరో ఊరికి వెళ్లే క్రమంలో ఆయన వాహనంలో వెళతారు. గ్రామాల్లో మాత్రం పాదయాత్ర చేస్తూ ప్రజలతో మమేకమవుతారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 3 రోజుల చొప్పున యాత్ర చేసేలా ఇప్పటికే రూట్ మ్యాప్ ఖరారు చేశారు.
కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ అయిన బండి సంజయ్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ టికెట్ ఆశిస్తున్నారు. పార్టీ హైకమాండ్ తనకు తప్పక అవకాశం ఇస్తుందని భావిస్తున్న బండి సంజయ్ యాత్రకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.