ఆ రెండు జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదు.. బండ్ల గణేష్ జోస్యం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలన్నీ సభలు, సమ్మేళనాలు పెట్టి ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సినీ నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా గెలవదని జోస్యం చెప్పారు. ఆ రెండు జిల్లాలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఆ సునామీలో అన్ని పార్టీలు కొట్టుకుపోతామని చెప్పుకొచ్చారు. మీడియా ముందుకు కాకున్నా.. పార్టీ ప్రయోజనాల కోసం తాను ఏం చేయాలో అది చేస్తున్నానని అన్నారు. గత ఎన్నికల్లో టికెట్ కోసం ఆశించానని, ఈసారి తనకు ఇష్టమైన రేవంత్ రెడ్డి సీఎం రేసులో ఉన్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి పదవిలో కూర్చుంటే.. తాను అధికారంలో ఉన్నట్లేనని చెప్పుకొచ్చారు.