కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించింది. సాధారణ వ్యక్తిగా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో నిలబడ్డ బర్రెలక్క.. అతితక్కువ టైంలో రాష్ట్రమంతా పాపులర్ అయింది. తన సమస్యను వీడియో రూపంలో చెప్తూ.. సోషల్ మీడియాలో వైరల్ అయిన బర్రెలక్క ఈ ఎన్నికల్లో పోటీ చేసింది. నిరుద్యోగుల గొంతుగా, ప్రభుత్వ పనితీరును ఎండగడుతూ.. ఎదిరించి నిలబడింది. తను పాపులరైన సోషల్ మీడియానే ప్రచార మాద్యమంగా వాడుకుంది. దీంతో వేలాది మంది బర్రెలక్క కోసం తరలివచ్చారు. స్వచ్చందంగా తనకోసం నిలబడ్డారు. దీంతో కోల్లాపూర్ నుంచి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీ అభ్యర్థులకు గట్టి పోటీ పక్కా అనుకున్నారంతా. కానీ బర్రెలక్క ట్రెండ్ కేవలం సోషల్ మీడియా వరకే పరిమితమైంది. భారీ మెజార్టీ కాదు కదా.. కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. ఆదివారం వెలువడ్డ ఫలితాల్లో బర్రెలక్కకు 5,754 ఓట్లు రాగా.. నాలుగో స్థానంలో నిలిచింది.
ఈ ఓటమితో బర్రెలక్క పని అయిపోయిందని, కేవలం అసెంబ్లీ ఎన్నికల వరకే పరిమితమైందని అనుకున్నారంతా. కేవలం పేరుకోసమే ఎన్నికల్లో పోటీ చేసిందని, ఇకపై కనిపించదని అన్నారు. వాటన్నింటికీ బర్రెలక్క సమాధానం ఇచ్చింది. తన ప్రయాణం అయిపోలేదని ప్రజలు, నిరుద్యోగుల పక్షన పోరాటం ఆపనని స్పష్టం చేసింది. ఈ నెల రోజుల్లో రాజకీయం గురించి తెలుసుకున్నానని, ఎక్కడి నుంచో వచ్చి తనపై నమ్మకం ఉంచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. తనకు 5వేల ఓట్లే వచ్చినా.. వచ్చిన ప్రతీ ఓటు ముఖ్యమైనదేనని స్పష్టం చేశారు. తన ప్రయాణం ఇంకా అయిపోలేదని, రాబోయే ఎంపీ ఎలక్షన్స్ లో తన సత్తా చూపిస్తాని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందుతామని తేల్చిచెప్పారు.