ప్రయాణికులకు అలర్ట్..ఇకపై టోల్ ప్లాజా దగ్గర ఆగక్కర్లేదు
జాతీయ రహదారులపై ప్రయాణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. సుదూర ప్రాంతాలైనా సరే తమ సొంత వాహనాల్లోనే ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రయాణం సాఫీగా సాగుతున్నా టోల్ ప్లాజాల దగ్గర మాత్రం వాహనాల వెయిటింగ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఫాస్టాగ్ పద్ధతి అందుబాటులోకి వచ్చినా రద్దీ రోజుల్లో మాత్రం టోల్ ప్లాజాల వద్ద వాహనాల క్యూ అంతకంతకు పెరుగుతోంది. ఈ క్రమంలో అధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు ఎక్కువ సమయం ఆగనవసరం లేకుండా ఓ కొత్త వ్యవస్థను అమలు చేసేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. ఓపెన్ టోల్ పద్ధతిని ఇంట్రడ్యూస్ చేసేందుకు ట్రయల్స్ నిర్వహిస్తోంది.
ఓపెన్ టోల్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే టోల్ ప్లాజాల వద్ద ప్రయాణికులు అర నిమిషం కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ తెలిపారు. ఫాస్టాగ్ సిస్టమ్‌కు ప్రత్యామ్నాయంగా వస్తున్న ఈ కొత్త ఓపెన్ టోల్ పద్ధతి అమలుకు సంబంధించి ప్రస్తుతం ట్రయల్స్ నడుస్తున్నాయన్నారు. ఈ సిస్టమ్ సక్సెస్ కాగానే అమలు చేస్తామని చెప్పారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రయాణికుల ప్రయాణ సమయం తగ్గడం, ట్రాఫిక్ ఇబ్బందులు తొలగడంతో పాటు కిలో మీటర్ల ఆధారంగానే టోల్ చెల్లింపులు చేయవచ్చన్నారు.
ఫాస్టాగ్ ద్వారా టోల్ ప్లాజాల వద్ద చెల్లింపులు చేసేందుకు ఎంత లేదన్నా 47 సెకన్ల వరకు సమయం పడుతుంది. ఆ సమయాన్ని 30 సెకన్ల కంటే తక్కువకు కుదించడమే సర్కార్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. సాంకేతికత ఆధారంగా ఉపగ్రహ, కెమెరాల ద్వారా పనిచేసే ఈ నయా టోల్ వ్యవస్థను దేశ రాజధాని ఢిల్లీ-మేరఠ్ ఎక్స్‌ప్రెస్ హైవేలో పైలట్ ప్రాజెక్టుగా పరీక్షిస్తున్నారు. ఒక్కసారి నేషనల్ హైవే మీదకు ప్రవేశించగానే టోల్ ప్లాజా దగ్గర వెహికల్ రిజిస్ట్రేషన్ ప్లేట్‌ను కెమెరా స్కాన్ చేసి డేటాను కలెక్ట్ చేస్తుంది. వాహనం ప్రయాణించిన కి.మీ.ల ఆధారంగా ఛార్జీలు వసూలు చేస్తుంది.