Bhatti Vikramarka : ధరణి చాలా మందికి ఆభరణంగా మారింది : భట్టి

Update: 2024-02-10 08:46 GMT

ధరణి పోర్టల్ కొంతమందికి ఆభరణంగా మారిందని భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఆయన మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ధరణి పోర్టల్పై కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ఎంతో హడావుడిగా, ఎలాంటి అధ్యయనం చేయకుండా తీసుకొచ్చిన ధరణితో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని అన్నారు. ‘‘ధరణి కొంతమందికి భరణంగా మరికొంత మందికి ఆభరణంగా చాలా మందికి భారంగా మారింది’’ అని చెప్పారు.

గత ప్రభుత్వం చేసిన తప్పులతో ఎంతో మంది తమ అవసరాల కోసం సొంత భూమిని కూడా అమ్ముకోలేకపోయారని భట్టి అన్నారు.పెళ్లిళ్లకు, చదువులకు ఇతర అవసరాలను తీర్చుకోలేక తీవ్ర ఆవేదన చెందారని చెప్పారు. ఇదంతా లోపభూయిష్టమైన ధరణి పోర్టల్ కారణంగానే జరిగిందని.. ప్రస్తుతం తమ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేందుకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు సత్వర చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

ధరణి పోర్టల్ అమలు కారణంగా వచ్చిన సమస్యలను అధ్యయనం చేయడానికి ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని నియమించినట్లు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఇంతటి కీలకమైన నిర్ణయం తీసుకుని నిపుణుల కమిటీకి బాధ్యత అప్పగించడం గతంలో ఎన్నడూ జరగలేదని వ్యాఖ్యానించారు. కాగా ధరణి పోర్టల్ స్థానంలో భూమాతను తీసుకొస్తామని గతంలోనే కాంగ్రెస్ హామీ ఇచ్చింది.


Tags:    

Similar News