రాష్ట్రంలోని ప్రతి ఇంటిని సర్వే చేస్తాం : Bhatti

Byline :  Krishna
Update: 2024-02-16 09:33 GMT

రాష్ట్రంలోని ప్రతి ఇంటిని సర్వే చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కులాలతో పాటు ఆర్థిక పరిస్థితులపై ఆరా తీస్తామని తెలిపారు. సర్వేలో అన్నీ వివరాలు పొందుపరుస్తామని చెప్పారు. శాసనసభలో పొన్నం ప్రభాకర్ కులగణన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి.. అసెంబ్లీలో కులగణన తీర్మానం ప్రవేశపెట్టడం చారిత్రకమన్నారు. ఇటువంటి చారిత్ర నిర్ణయం తీసుకున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు.

దేశంలో కులగణన జరగాలని రాహుల్ గాంధీ చెప్పారని.. అందుకు అనుగుణంగానే బిల్లు ప్రవేశపెట్టామని భట్టి చెప్పారు. జనాభా దామాషా ప్రకారం సర్వే చేస్తామన్నారు. సంపద ఎక్కడ కేంద్రీకృతమైందనే విషయాన్ని తెలుసుకుంటామన్నారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నా.. కులగణన సర్వే చేయలేదని విమర్శించారు. ఎన్నో మార్పులకు ఈ సర్వే పునాదిగా మారుతుందని చెప్పారు.

అంతకుముందు మాట్లాడిన సీఎం రేవంత్.. కుల గణన తీర్మానం ప్రవేశపెట్టడం చారిత్రాత్మక నిర్ణయం అని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలపై ఇంటింటి సర్వే చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రజలకు మేలు చేసే నిర్ణయాలనే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని.. వెనుకబడిన వర్గాల సమాచారాన్ని సర్వే ద్వారా సేకరిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే వివరాలను బహిర్గతం చేయలేదని విమర్శించారు. ఆ సమాచారాన్ని ఒక కుటుంబం తన దగ్గర దాచుకుందని ఆరోపించారు.

Tags:    

Similar News