కాంగ్రెస్కు షాక్.. బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ కీలక నేత..
భువనగిరిలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగలింది. ఆ పార్టీ కీలక నేత, డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి ప్రగతిభవన్ వెళ్లిన అనిల్కు సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనిల్కు బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ హామీతోనే ఆయన పార్టీ మారినట్లు తెలుస్తోంది.
అంతకుముందు భువనగిరిలో కార్యకర్తల సమావేశం నిర్వహించిన అనిల్ కుమార్.. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. కోమటిరెడ్డి గ్రూప్ రాజకీయాలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో తనను ఓడగొట్టేందుకు రహస్య మంతనాలు చేస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగత లాభాన్ని వదులుకుని కాంగ్రెస్ కేడర్ను కాపాడుకుంటూ వస్తున్నట్లు తెలిపారు.
‘‘40 ఏళ్లలో భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఇప్పటి వరకు నియోజవర్గంలో ఓడిన వారెవరూ నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో లేరు. నేను మాత్రం ఎనిమిదిన్నర ఏళ్లుగా అందుబాటులో ఉంటూ అందరిని కలుపుకొని పోతున్నా. గడిచిన నాలుగు నెలలుగా నియోజకవర్గంలో కోమటిరెడ్డి మాకు సమాంతరంగా మీటింగులు నడుపుతూ క్యాడర్ను అయోమయానికి గురి చేస్తున్నారు అని ఆరోపించారు. అనిల్ కుమార్ బీఆర్ఎస్లో చేరడం కాంగ్రెస్ ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. మరి దీనిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి.