KCR : బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. కోకాపేట భూములపై హైకోర్టులో పిటిషన్

Update: 2024-01-26 02:12 GMT

గత బీఆర్‌ఎస్ సర్కార్ హయంలో కోకాపేటలో 11 ఎకరాల భూమిని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ కోసం బీఆర్ఎస్ కు కేటాయించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను కోర్టు స్వీకరించింది.హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది ఎ. వెంకట్రామిరెడ్డి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇప్పటికే ఫోరంఫర్‌ గుడ్‌గవర్నెన్స్‌ (ఎఫ్‌జీజీ) ఈ వ్యవహారంపై పిల్‌ దాఖలు చేసింది. దీనిపై నోటీసులు సైతం జారీఅయ్యాయి. ఆ కారణంగా ప్రస్తుత పిటిషన్‌కు రిజిస్ర్టీ నెంబర్‌ కేటాయించలేదు. రిజిస్ర్టీ అభ్యంతరాలతో రెండో పిటిషన్‌ చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌అరాధే, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.

న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపిస్తూ 11 ఎకరాల భూకేటాయింపు అంశం ఒక్కటే అయినా తమ పిటిషన్‌లో విస్తృత అంశాలు ఉన్నాయని తెలిపారు. దీంతో ప్రస్తుత పిటిషన్‌కు రెగ్యులర్‌ నెంబర్‌ ఇవ్వాలని ధర్మాసనం రిజిస్ర్టీకి ఆదేశాలు జారీచేసింది. ఎఫ్‌జీజీ దాఖలు చేసిన పిటిషన్‌తో కలిపి వాదనలు వింటామని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది.ఎకరా రూ.50 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.3.41 కోట్లకే కేటాయించారని.. ఐదు రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తయిందని.. దీంతో రాష్ట్ర ఖజానాకు రూ.1,100 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు పిటిషనర్ పేర్కొన్నారు. ఈ కేటాయింపును రద్దు చేసి, ఏసీబీ కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఇందులో ప్రతివాదులుగా మాజీ సీఎం కేసీఆర్ పేరును కూడా చేర్చారు. గత ఏడాది జులైలో దాఖలైన ఈ పిటిషన్‌ను హైకోర్టు ఈ రోజు విచారణకు స్వీకరించింది.




Tags:    

Similar News