బీఆర్ఎస్లో చేరిన బిత్తిరి సత్తి.. కేసీఆరే పెద్ద దిక్కంటూ..
బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతోంది. తీన్మార్ ప్రోగ్రాంతో ఫేమస్ అయిన బిత్తిరి సత్తి బీఆర్ఎస్లో చేరారు. మంత్రి హరీష్ రావు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సత్తి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అమ్ముడుపోయాను అని కొంతమంది అన్నారని.. కానీ ఎవరికి అమ్ముడుపోలేదని.. కేసీఆర్తోనే తన పయనమని చెప్పారు. మాటలు చెప్పేవాళ్లు కాదని.. ప్రజల కోసం కొట్లాడే కేసీఆర్ గద్దెపై ఉండాలన్నారు. పచ్చటి తెలంగాణను కొంతమంది పచ్చెలు పచ్చెలు చేయాలని చూస్తున్నారని.. అటువంటి నేతలను నమ్మొదన్నారు.
తెలంగాణకు కేసీఆర్ పెద్ద దిక్కు అని బిత్తిరి సత్తి అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ను మించిన మెగా హీరో ఎవరు లేరన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేసీఆర్ ఎన్నో గొప్ప కార్యక్రమాలను చేపట్టారని.. ఆయన హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు సైతం కేసీఆర్ ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాగా బిత్తిరి సత్తి.. కొన్ని రోజుల క్రితం పరేడ్ మైదానంలో జరిగిన ముదిరాజ్ సభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అవి నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో ఆయన బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో గురువారం కేటీఆర్ తో భేటీ అయిన బిత్తిరి సత్తి.. ఇవాళ హరీష్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.