కర్నూలు జిల్లా గోనెగండ్లలో ఓ ప్రభుత్వ ఉద్యోగికి చేదు అనుభవం ఎదురైంది. ఓ మహిళా రైతు వీఆర్వో చెంప చెల్లు మనిపించింది. తమ పొలాన్ని వేరొకరి పేరుతో రిజిస్ట్రేషన్ చేశారంటూ ఆగ్రహంతో ఊగిపోయిన మహిళ వీఆర్వోకు షాక్ ఇచ్చింది. తనకు న్యాయం చేయాలని వేడుకున్నా వీఆర్వో పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. స్థానికులు సర్దిచెప్పడంతో మహిళా రైతు శాంతించింది.
గోనెగండ్ల మండలం నెలటూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చాకలి వీరయ్య , శివపార్వతి దంపతులకు అదే గ్రామంలో సర్వే నెంబరు 430లో 9 ఎకరాల భూమి ఉంది అయితే 2014 లో అదే గ్రామానికి చెందిన రాముడు వీఆర్వో సహకారంతో సర్వే నెంబరు 430లోని రెండు ఎకరాల భూమిని తనపేరుమీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ తరువాత భూమి తనదే అంటూ రాముడు కోర్టుకు వెళ్లాడు. కోర్ట్ ఇష్యూ కారణంగా 9 ఎకరాల భూమి రెడ్ మార్క్‌లో పడింది. దీంతో శివ పార్వతుల దంపతులకు సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. తమకు న్యాయం చేయాలంటూ తహశీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో వీఆర్వోతో వాగ్వాదానికి దిగారు. సహనం కోల్పోయిన శివపార్వతి వీఆర్వో చెంప చెల్లుమనిపించింది.
న్యాయం ఎప్పుడు చేస్తారంటూ నిలదీసింది. స్థానికులు సర్దిచెప్పడంతో శివపార్వతి శాంతించింది.