TS budget session : బీజేఎల్పీ నేత ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్.. ఫ్లోర్ లీడర్ లేకుండానే..

Byline :  Kiran
Update: 2024-02-08 05:45 GMT

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో గవర్నర్ తమిళిసై సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ మాత్రం ఫ్లోర్ లీడర్ లేకుండానే సమావేశాలకు హాజరుకానుంది. బీజేఎల్పీ నేత ఎంపికపై కమలం పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ఫ్లోర్ లీడర్ ఎంపికపై బీజేపీ హైకమాండ్ ఇంకా ఓ నిర్ణయానికి రాకపోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో గందరగోళం నెలకొంది.

గతేడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వారిలో ఎవరికి ఫ్లోర్ లీడర్ పదవి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఇంకా బీజేఎల్పీ నేత ఎంపిక జరగకపోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలలో రాజాసింగ్ మినహా ఎవరికి ఎల్పీనేత పదవి బాగుంటుందన్న కసరత్తులో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.

బీజేఎల్పీ నేత పదవి ఆశిస్తున్న ఎమ్మెల్యేల్లో వెంకట రమణారెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రాకేష్ రెడ్డి, పాయల్ శంకర్ తదితరులు ఉన్నారు. ఫ్లోర్ లీడర్ లేనందున పార్టీ హైకమాండ్ సూచన మేరకు అంశాలవారీగా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడే అవకాశముంది. ఇక గవర్నర్ ప్రసంగం అనంతరం నిర్వహించే బీఏసీ సమావేశానికి బీజేపీ తరఫున ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి హాజరుకానున్నారు.

Tags:    

Similar News