తెలంగాణ కమలదళంలో కీలక మార్పులు జరుగనున్నాయి. అధ్యక్ష మార్పు, అసంతృప్తి నేతల బుజ్జగింపు, కీలక నేతలకు కేంద్ర మంత్రి పదవులు.. అంటూ గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ అధిస్టానం నేతలను బుజ్జగించే పనిలో పడింది. అసంతృప్తి నేతలతో మంతనాలు జరిపి.. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ప్లాన్ చేస్తుంది. ఇదివరకే ఈటల రాజేందర్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, కిషన్ రెడ్డిలను ఢిల్లీకి పిలిచి.. చర్చలు జరిపిన హైకమాండ్.. ఇప్పుడు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పిలుపు వచ్చింది. దీంతో ఈ ఇద్దరు నేతలు సోమవారం (జులై 3) ఢిల్లీ బయలుదేరనున్నారు.
ఇవాళ బీజేపీ కేబీనెట్ మీటింగ్ లో రాష్ట్ర అధ్యక్ష మార్పుపై నిర్ణయం వెలువడనున్న క్రమంలో.. రాష్ట్ర నేతలు విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావులకు ఢిల్లీ నుంచి పిలుపు రావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఇటీవలే.. బీజేపీ రాష్ట్ర నాయకులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పార్టీలో తనను అడుగడుగునా అడ్డుకుంటున్నారని, అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పనిచేస్తున్నా పట్టించుకోవట్లేదని వాపోయారు. ఈ క్రమంలో రఘునందన్ రావుకు పార్టీలో ఏదో ఒక పదవి కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు చర్చలు వినిపిస్తున్నాయి. ఇవాళ జరిగే కేబినెట్ సమావేశం అనంతరం.. ఈ విషయాలన్నీ బయటికి వస్తాయి.