నేతల అల్టిమేటం.. బండి సంజయ్కు ఢిల్లీ నుంచి పిలుపు..

Update: 2023-06-05 04:33 GMT

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆదివారం ఢిల్లీ వెళ్లారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఆయన హస్తినకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీలో నెలకొన్న పరిణామాల దృష్ట్యా బండి ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ నేతల ఫిర్యాదు మేరకే హైకమాండ్ ఆయనను పిలిపించినట్లు సమాచారం.

ఆధిపత్య ధోరణి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ పగ్గాలు చేపట్టాక ఆయన పనితీరుపై హైకమాండ్ సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే గత కొన్నిరోజులుగా ఆయన పార్టీ నేతలతో కలిసి నడవడం లేదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయాన్ని కొందరు నాయకులు ఢిల్లీ వెళ్లి మరీ పార్టీ హైకమాండ్ ముందు మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. తన సొంత ప్రచారం, ఆధిపత్యం కోసం బండి సంజయ్‌ పాకులాడుతున్నారని, పార్టీలోని సీనియర్లకు గౌరవం, కార్యక్రమాల నిర్వహణలో ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న విషయాలను బీజేపీ పెద్దల దృష్టికి తెచ్చినట్లు సమాచారం. ఇక జిల్లాల పర్యటన సమయంలోనూ ఆయా ప్రాంతాలకు చెందిన నేతలను కలుపుకొని పోవడం లేదని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

నేతల అసంతృప్తి

గత నెలలో పలువురు పార్టీ నేతలు ఢిల్లీకి వెళ్లి బండి సంజయ్ వ్యవహారశైలిపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆయనను హస్తినకు పిలిపించిన పార్టీ పెద్దలు అందరినీ కలుపుకొనిపోవాలని చెప్పినట్లు సమాచారం. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో అసంతృప్త నేతలు అల్టిమేటం ఇచ్చినట్లు తెలుస్తోంది. అధికార పార్టీని సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమాలు జరగడంలేదని పార్టీ పెద్దలకు చెప్పినా వారు పట్టించుకోవడంలేదని నేతలు అంటున్నారు. ఈ క్రమంలో నెలాఖరు వరకు వేచి చూసి అప్పటికీ వైఖరిలో మార్పు రాకపోతే తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం

హైకమాండ్ దృష్టి

రాష్ట్ర బీజేపీలో తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. పరిస్థితి చేయి దాటే అవకాశముండటంతో బండిని మరోసారి ఢిల్లీ పిలిపించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ నాయకత్వ మార్పు జరగొచ్చన్న ఊహాగానాలు మరోసారి జోరందుకున్నాయి. మరి బీజేపీ పెద్దలు బండికి మరోసారి వార్నింగ్ ఇస్తారా లేక పార్టీ బాధ్యతలు వేరొకరికి అప్పగిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News