Raghunandan Rao: బీఆర్ఎస్ ఓటమికి అదే కారణం.. బీజేపీ నేత రఘనందన్‌రావు

Byline :  Veerendra Prasad
Update: 2024-01-23 08:14 GMT

ఉద్యమకారులకి, కష్టపడేవారికి బీఆర్ఎస్ లో ఏనాడూ గుర్తింపులేదన్నారు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రఘనందన్‌రావు. ఆ పార్టీ నేతలైన కేటీఆర్‌, హరీశ్‌రావులు అధికారం కోల్పోయాక ఉద్యమకారులకి సముచిత స్థానం ఇస్తామంటున్నారని, ఉద్యమకారులు వారికిప్పుడు గుర్తొచ్చారా? అని ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘునందన్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ అమరవీరులకు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీలో కష్టపడే వారికి ఏనాడూ గుర్తింపులేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి సీట్లు ఇస్తామని కేటీఆర్‌, హరీశ్‌రావు అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ పేరును ప్రచారానికి ఉయోగించుకుని ఉద్యమకారులకు అన్యాయం చేశారని ఆరోపించారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత కీలక పదవుల్లో ఉంటూ రూ. వందల కోట్లు సంపాదించిన అధికారులకు రాజకీయ పదవులు కట్టబెట్టారని విమర్శించారు. మల్లన్న సాగర్‌, పోచమ్మ సాగర్‌ పేరుతో రూ. వందల కోట్లు దోచుకున్నారు. సీట్లు అమ్ముకోవడం.. డబ్బు దండుకోవడమనే ఆలోచనతో బీఆర్ఎస్ పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ సిద్ధాంతపరంగా విభిన్నమైన పార్టీలని.. రెండు ఒకటేనని బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఇతర పార్టీలతో బీజేపీ పొత్తులు పెట్టుకోదన్నారు. అహంకారం వల్లే బీఆర్ఎస్ నేతలు ప్రజలకు దూరమయ్యారని రఘనందన్‌రావు అన్నారు.

Tags:    

Similar News