కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ పైసలు, గెలిపిస్తే జరిగేది అదే.. బండి
బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల్లో సగం మందికి టికెట్లు దక్కవని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఆదివారం కరీనగర్ జిల్లా మానకొండూరులో విలేకర్లతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ పార్టీలో తమ మనషులు ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ నేతలే చెబుతున్నారు. కేసీఆర్ ప్రకటించిన జాబితాలో సగం మందికి బీ ఫారాలు రావు. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలసి పనిచేస్తోంది. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు డబ్బులు ఇస్తున్నారు. వారి గెలిస్తే బీఆర్ఎస్‌లో చేరడం ఖాయం’’ అని చెప్పారు. బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయే స్థానాల్లో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి కేసీఆర్ సాయం చేస్తారని, రామగుండం ఎమ్మల్యేకు డబ్బులు అందజేసింది ఆయన కాదా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ చేవెళ్లలో ప్రకటించిన దళిత డిక్లరేషన్‌పై బండి మండిపడ్డారు. అంబేద్కర్‌ను అవమానించిన కాంగ్రెస్ పార్టీ దళితులకు న్యాయం చేస్తుందనుకోవడం భ్రమ అని, వారికి మోదీ ప్రభుత్వమే అనేక పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలనతో విసిగిపోయారని, మార్పు కోరుతున్నారని అన్నారు. ‘‘బీఆర్ఎస్ పతనానికి కేసీఆర్ కుటుంబ అవినీతే కారణం అవుతుంది. వచ్చే ఎన్నికల్లో ప్రజలు మాకు అనుకూలంగా తీర్పిస్తారు. కేసీఆర్ ఎన్ని ఆశలు చూపినా ప్రజలు మా వెంటే ఉన్నారు’’ అన్నారు.