కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ను కాపాడాలని చూస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిందన్నారు. గతంలో కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ డిమాండ్ చేసిన కాంగ్రెస్.. ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యిందని ప్రశ్నించారు. జ్యుడీషియల్ విచారణతో కాలయాపన చేయాలని చూస్తోందని.. రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం అవినీతిపై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ ఎక్కగానే కాళేశ్వరంపై మాట మార్చడం దారుణమని డీకే అరుణ అన్నారు. సిట్టింగ్ జడ్జి కంటే సీబీఐతో విచారణ జరిపిస్తేనే నిజానిజాలు తేలుతాయన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం పంపులు మునగడానికి.. ప్రాజెక్టు డిజైన్ సహా నాణ్యత లోపమే కారణమని ఆరోపించారు. సీబీఐ విచారణ కోరుతూ.. సీఎం రేవంత్ కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కుంభకోణంపై కాంగ్రెస్ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేయాలని చెప్పారు.