కేసీఆర్ గురించి అలా అన్లేదు.. మాట మార్చిన బీజేపీ మురళీధర్ రావు
తెలంగాణ ఎన్నికల వేళ బీజేపీ నేత మురళీధర్ రావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కేసీఆర్‌ను ఓడించడం కష్టమంటూ ఆయన అన్న మాటలపై సొంత శ్రేణులే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన మాటల్లో ఓటమి భయం బయటపడిందని బీఆర్ఎస్ శ్రేణులు సంబరపడుతున్నాయి. దీంతో మురళీధర్ రావు వివరణ ఇచ్చారు. తన మాటలను మీడియా వక్రీకరించిందని చెప్పుకొచ్చారు.
మురళీధర్ రావు శుక్రవారం మీడియాతో ముచ్చటిస్తూ.. కేసీఆర్‌ను వెల్ఫేర్ పథకాలతో ఓడించలేమని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రచారం చేస్తేనే ఫలితం ఉంటుందన్నారు. ‘‘సంక్షేమం విషయంలో సీఎంను కొట్టలేం. అయితే ప్రతిసారి సంక్షేమం పేరుతో గెలవడం సాధ్యం కాదు. కేసీఆర్‌ను ఓడించాలంటే కార్యకర్తలు ప్రజాసమస్యలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలి. తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. వారి తరఫున పోరాడితే కేసీఆర్‌ను సులభంగా ఓడించవచ్చు’’ అని అన్నారు. కేసీఆర్ మాదిరే మధ్యప్రదేశ్‌లోని తమ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ కూడా సంక్షేమంలో ముందున్నారని అన్నారు. ‘‘కేసీఆర్ ఇచ్చిన హామీలు, వాటి అమలుపై ఇరకాటంలో పెట్టాలి. లేకపోతే ఓడించడం కష్టం’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు మండిపడడంతో శనివారం వివరణ ఇచ్చారు. తన మాటలను మీడియా వక్రీకరించిందని మురళీధర్ రావు అన్నారు. ‘‘యువత కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉంది బీజేపీ వారిపై దృష్టి సారిస్తే కేసీఆర్‌ను ఓడించడం సులభం’’ అని చెప్పిందే చెప్పారు.