టికెట్లు కన్ఫామ్.. కాంగ్రెస్లోకి బీజేపీ నేతలు..?

By :  Kiran
Update: 2023-09-27 09:58 GMT

అసెంబ్లీ ఎన్నికలకు మరో 2-3 నెలల సమయం మాత్రమే ఉండటంతో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించగా కాంగ్రెస్, బీజేపీలు సైతం అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నాయి. అయితే గెలుపోటములపై ఓ అంచనాకు వచ్చిన సీనియర్ నేతలు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా అక్టోబర్ మొదటివారంలో కొందరు సీనియర్లు బీజేపీకి షాకిచ్చేందుకు రెడీ అయినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారంతా కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమైనట్లు పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది.

బీజేపీలో తగ్గిన జోష్

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర బీజేపీలో జోరు తగ్గింది. అప్పటి వరకు ఈసారి అధికారం తమదేనని ధీమాతో ఉన్న నేతలు పునరాలోచనలో పడ్డారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన సీనియర్లు అయోమయంలో పడ్డారు. ఇదే అదునుగా కాంగ్రెస్ గాలం వేయడంతో వారు హస్తం గూటికి చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. సీనియర్ నేతలైన కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

హస్తం వైపు కొండా చూపు

2013లో కేసీఆర్ ఆహ్వానం మేరకు కొండా విశ్వేశ్వర రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. తదనంతర పరిణామాల్లో భాగంగా 2018లో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరారు. 21 మార్చిలో కాంగ్రెస్కు రాజీనామా చేసిన కొండా.. బీజేపీ కండువా కప్పుకున్నారు. కమలదళంలో చేరకముందు సర్వే చేయించిన ఆయన ఫలితం బీజేపీకి అనుకూలంగా ఉండటంతో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో తాజాగా నిర్వహించిన మరో సర్వేలో బీజేపీ సీన్ రివర్స్ అయినట్లు తేలడంతో ఆయన మళ్లీ కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. అంతేగాక కొండా విశ్వేశ్వర్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య సత్సంబంధాలుండటం కూడా ఆయన హస్తం పార్టీ వైపు మొగ్గుచూపేందుకు మరో కారణంగా తెలుస్తోంది.

అసంతృప్తిలో రాజగోపాల్

మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతేడాది కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. అయితే మునుగోడు బై పోల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచే ఆయన బీజేపీలో అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన బీజేపీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఇటీవలే రాజగోపాల్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో భేటీ కావడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.

కాంగ్రెస్ టికెట్ కన్ఫామ్..!

బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు రాజగోపాల్ రెడ్డి కొంతకాలంగా కాంగ్రెస్ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వారి చేరికకు హైకమాండ్ సైతం ఓకే చెప్పడంతో త్వరలోనే వారిద్దరూ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. పార్టీలో చేరకముందే వారిద్దరికీ కాంగ్రెస్ టికెట్ కన్ఫామ్ చెప్పినట్లు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. కొండా విశ్వేశ్వర రెడ్డికి చేవెళ్ల ఎంపీ, కోమటిరెడ్డి రాజగోపాల్కు మునుగోడు అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ అంగీకరించినట్లు సమాచారం. కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్లోనే వారిద్దరి పేర్లు ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Full View

Tags:    

Similar News