మరో మూడు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో.. రాష్ట్ర రాజకీయాలు రంజుగా మారాయి. ఈ నేపథ్యంలో నేడు ఖమ్మంలో బీజేపీ (BJP) బహిరంగ సభ వేదికగా అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. అమిత్ షా సభను పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల ప్రకటించడం, కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులను వడబోస్తున్న నేపథ్యంలో ఆదివారం జరగబోయే సభలో అమిత్ షా ఏం మాట్లాడుతారు? ఏమైనా కీలక ప్రకటనలు చేస్తారా?. బీజేపీలోకి కొత్తగా ఏమైనా చేరికలు ఉంటాయా? అనేది రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే అమిత్‌షా తెలంగాణలో పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి.
కొన్ని అనివార్య కారణాల వల్ల భద్రాచలం కార్యక్రమం రద్దు అయ్యింది. దీంతో ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఆదివారం మధ్యాహ్నం గన్నవరంలో దిగుతారు అమిత్ షా. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నేరుగా ఖమ్మంకు కేంద్రమంత్రి రానున్నారు. 3.45 నిమిషాలకు సభ వేదిక వద్దకు చేరుకోనున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం.. మధ్యాహ్నం హెలికాప్టర్‌లో భద్రాచలం చేరుకోవాల్సి ఉండేది. అక్కడ ఆలయంలో సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన తర్వాత హెలికాప్టర్‌లో ఖమ్మంకు చేరుకుని బహిరంగసభలో పాల్గొనేవారు.
బహిరంగ సభ పూర్తి అయిన అనంతరం 4. 40 గంటలకు అక్కడే ఏర్పాటు చేసిన పార్టీ కోర్ కమిటీ మీటింగ్‌లో పాల్గొననున్నారు. 5. 30 గంటల వరకు కోర్ కమిటీ మీటింగ్ కొనసాగునుంది. 5. 40 గంటలకు ఖమ్మం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరి వెళ్లనున్నారు. 6.20 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు వెళతారు.కాగా ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్రలో కేంద్ర మంత్రి హోదాలో పార్టీ అగ్రనాయకత్వం ఖమ్మం సభకు రావడం ఇదే తొలిసారి.