ఆగస్టు 6న బీజేపీ బహిరంగ సభ : ఈటల

Update: 2023-07-23 13:19 GMT

ఆగస్టు 6న బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణ ప్రజా సమస్యలను పుస్తక రూపంలో తీసుకురానున్నట్లు వెల్లడించారు. రేపటి తెలంగాణ ఆకాంక్షల వేదిక సభలో ఈటల పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర విద్యా వ్యవస్థను కేసీఆర్ నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ విశ్వవిద్యాలయాల స్థానంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలను తీసుకొచ్చారని మండిపడ్డారు. పేదవాడికి విశ్వవిద్యాలయం విద్యను దూరం చేస్తున్నారన్న ఈటల.. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవని విమర్శించారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులును భర్తీ చేయడం లేదని ధ్వజమెత్తారు. విద్యార్థులు, టీచర్లు, లెక్చరర్స్, రైతులు, యువత.. ఇలా ప్రతి ఒక్కరూ కేసీఆర్ పాలనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రాచరికపు పోకడలతో, అహంకారంతో కేసీఆర్ పాలన చేస్తున్నారని మండిపడ్డారు.

వ్యాపారవేత్తలకు చౌకగా భూములు కట్టబెట్టేందుకు ధరణి తీసుకొచ్చారని ఈటల ఆరోపించారు. ధరణితో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ధరణి సమస్యలపై ప్రత్యేక కమిటీ వేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా మారిందని..తక్కువ ధరకే ప్రభుత్వ భూములను అమ్ముతున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపిస్తామన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వకపోవడమే కాకుండా ఉన్న భూములు కూడా లాక్కొన్నారని విమర్శించారు.  

 


Tags:    

Similar News