Bandi Sanjay: సర్పంచుల పెండింగ్ బిల్లుల అంశంపై సీఎం రేవంత్‌కు బండి సంజయ్ లేఖ

Byline :  Veerendra Prasad
Update: 2024-01-24 07:16 GMT

సర్పంచుల పెండింగ్ బిల్లుల విడుదలకు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి.. కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు కావస్తున్నా సర్పంచుల పెండింగ్ బిల్లులపై దృష్టి సారించకపోవడం దురదృష్టకరమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సర్పంచుల పెండింగ్ బిల్లులను అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. ఈ అంశాన్ని పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సర్పంచుల సంఘం ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని బండి సంజయ్‌ కోరారు.

కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం గ్రామాలకు కేటాయించిన నిధులను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దారిమళ్లించిందని బండి సంజయ్‌ ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గత బీఆర్‌ఎస్‌ హయాంలో పెండింగ్ బిల్లుల కారణంగా రాష్ట్రంలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. గ్రామాభివృద్ధి కోసం చేసిన పనులను కూడా ప్రభుత్వ అధికారులు రికార్డు చేయకుండా సర్పంచులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధికి సర్పంచులు చేసిన పనులను వెంటనే రికార్డు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం సర్పంచులతో సహా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనం పెంచాలని కోరారు. మాజీ సర్పంచులు, ఇతర స్థానిక సంస్థల ప్రతినిధులకు పెన్షన్‌ మంజూరు చేయాలని బండి సంజయ్‌ ఆ లేఖలో పేర్కొన్నారు.




Tags:    

Similar News