ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే మచ్చ లేని నాయకుడు మోదీ అని తెలిపారు. మోదీ దేశానికి ప్రధాని కాకముందు తెలంగాణ రాష్ట్రంలో కేవలం 2500 కిలోమీటర్లు మాత్రమే జాతీయ రహదారి ఉండేదని అన్నారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన 9 ఏళ్లలో మరో 2500 కిలోమీటర్ల జాతీయ రహదారిని మంజూరు చేసిందని పొగడ్తలతో ముంచేశారు.
సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.." ప్రపంచంలోనే సమర్థవంతమై, మచ్చలేని నాయకుడు ప్రధాని మోదీ. దేశం అభివృద్ధి చేందాలని ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత జాతీయ రహదారులు, రైల్వేల అభివృద్ధితో పాటు మౌలిక వసతుల కల్పనలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ నాయకత్వంలో అంకితభావంతో పని చేస్తోంది. మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తోంది. తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో 32 జిల్లాలు జాతీయ రహదారులతో కనెక్ట్ అయి ఉన్నాయి. 9 ఏళ్లలో తెలంగాణను ఎంతో అభివృద్ధి చేశారు. హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు నూతన ఎమ్‌ఎమ్‌టీఎస్ రైలును సైతం మోదీ ప్రారంభించారు. ఇవాళ వరంగల్‌లో 150 ఎకరాల్లో రైళ్ల తయారీ సంస్థను ఏర్పాటు చేయడం ఎంతో ఆనందించదగిని విషయం"అని కిషన్ రెడ్డి మోదీని ఉద్దేశించి మాట్లాడారు.