ఐపీఎల్-16 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. 5 వికెట్ల తేడాతో విజయం సాధించి.. 5 వ సారి కప్ గెలవడంతో ధోని అభిమానులు పండుగ చేసుకున్నారు. ఆఖరి బాల్ వరకు ఉత్కంఠ రేపిన ఫైనల్ మ్యాచ్ లాస్ట్ ఓవర్ లో రవీంద్ర జడేజా అద్భుతంగా ఆడి జట్టును గెలిపించాడు. లాస్ట్ రెండు బాల్స్‌కు 10 రన్స్ అవసరమైన సిక్స్, ఫోర్‌తో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. CSK గెలుపుతో తమిళనాడు వ్యాప్తంగా ధోనీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే ఇంతలోనే తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ పై నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అన్నామలై... ఈ సారి చెన్నై సూపర్ కింగ్స్ గెలవడానికి తమ పార్టీనే కారణమని చెప్పారు. ఆ రాష్ట్రంలో జరిగిన ఓ టీవీ ప్రోగ్రామ్ లో మాట్లాడుతూ ... బీజేపీ వల్లే చెన్నై గెలిచిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. గుజరాత్‌కు చెందిన జడేజా ఓ బీజేపీ కార్యకర్త అని.. అతనే చెన్నై జట్టును గెలిపించాడన్నారు అన్నామలై. ఇక జడేజా భార్య బీజేపీ ఎమ్మెల్యే అన్న విషయాన్ని గుర్తుచేస్తూ.. అందుకే చెన్నై గెలిచిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తమిళనాడు ఆటగాళ్లు లేని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. తమిళ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్న గుజరాత్ జట్టుపై గెలిచిందన్నారు.
గతేడాది చివర్లో జరిగిన గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ తరుఫున పోటీ చేసిన రవీంద్ర జడేజా భార్య రివాబా ఘన విజయం సాధించారు. జామ్ నగర్ నార్త్ నుంచి బరిలోకి దిగిన ఆమె 50వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆ సమయంలో భార్య తరుఫున బీజేపీకి ప్రచారం చేశాడు జడేజా. ఇక IPL-2023 ఫైనల్ మ్యాచ్ కు కూడా రివాబా హాజరయ్యారు. చివరి బంతికి జడేజా బౌండరీ బాదడంతో రివాబా సంతోషంతో కన్నీటిపర్యంతమయ్యారు. ఆనందబాష్పాలతో చప్పట్లు చరుస్తూ భర్త జడేజాను, సీఎస్కే ఆటగాళ్లను అభినందించారు.