బండికి హైకమాండ్ వార్నింగ్.. మధ్యలో లేచొచ్చిన మాజీ చీఫ్!

Update: 2023-07-22 06:21 GMT

బండి సంజయ్ పదవి పోయినా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ‘మీరు చేసేది మీరు చేసుకోండి, నేను చేసేది నేను చేస్తా. నా స్టైల్ ఇదే. ఇలాగే మాట్లాడుతా.. ఏం చేస్తారో చూసుకుందాం’’ అన్నట్లు ఉంది ఆయన ధోరణి. ‘‘కిషన్ రెడ్డిని అయినా ప్రశాంతంగా పనిచేసుకోనివ్వండి. నాపై ఢిల్లీ పెద్దలకు లేనిపోనివి చెప్పారు. ఇకనైనా అలాంటి పనులు మానుకోండి’’ అని బండి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలోని అంతర్గత కుమ్ములాటల గురించి చెప్పకనే చెబుతున్నాయి. ఈటల రాజేందర్‌కు పెద్ద పీట వేయడం తొలి నుంచి పార్టీలో ఉండి, పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడుతున్న బండి సంజయ్ వంటి వారికి గిట్టడం లేదు. అధిష్టానం ఏ కారణంతో బండిని తప్పించి కిషన్ రెడ్డిjr టీబీజేపీ పీఠం అప్పగించినా పొరపొచ్చాలు ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు.

కిషన్ రెడ్డి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న రోజే బండి చేసిన ‘‘ప్రశాంతంగా’’ వ్యాఖ్యలు అధిష్టానానికి మింగుడు పడడం లేదు. బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. అలా మాట్లాడడం సరికాదని, సమస్యలేవైనా ఉంటే లోలోపల మాట్లాడుకోవాలని ఆయన హితవు పలికినట్లు సమాచారం. ఇలాంటి మాటలతో పార్టీ నష్టపోతుందని, కార్యకర్తల నైతిక స్థైర్యం దెబ్బతింటుందని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ సునీల్ భన్సల్ గట్టిగా మందలించారని చెబుతున్నారు. దీంతో బండి కోపంతో దీటుగా బదులిచ్చి భేటీలో మధ్యలోనే లేచి బయటికి వెళ్లిపోయారని సమాచారం.

బండి సంజయ్ ఈటలను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశారని శ్రేణులు భావిస్తున్నాయి. ప్రస్తుతం పెద్దగా ప్రాధాన్యం లేని జాతీయ కార్యవర్గ సభ్య పదవి తీసుకున్న బండికి కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తుండడమే దీనికి కారణం. తెలంగాణలో బీజేపీ హవా పెంచిన తనను అధిష్టానం పూచికపుల్లలా తీసిపారేయడం ఆయనకు జీర్ణం కావడం లేదు. ఇప్పుడే ఇలా ఉండే ఇక ఎన్నికల ముందు తన మాట ఎవరూ వినరన్నది ఆయన ఆందోళన. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి ఇద్దరు ముగ్గురు తప్ప బండి వెంట ప్రస్తుతం ఎవరూ లేనట్టే. ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యతలు తీసుకున్న ఈటల ఢిల్లీ పెద్దలతో రాసుకుపూసుకుని తిరిగి మంచి మైలేజే కొట్టేశారని టాక్.

Tags:    

Similar News