అధికారంలోకి వచ్చాక.. అవినీతి పరులను బుల్డోజర్ తో తొక్కిస్తం: కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం (జులై 21) ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జ్యోతిరావు పూలే విగ్రహానికి, అసెంబ్లీ దగ్గరున్న అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. తర్వాత నాంపల్లి బీజేపీ పార్టీ ఆఫీసుకు చేరుకుని అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సమావేశంలో మాట్లాడిన కిషన్ రెడ్డి.. రానున్న 100 రోజులు బీజేపీ కార్యకర్తలు, నాయకులకు కీలకమని తెలిపారు. జులై 24న అన్ని జిల్లాల్లో, జులై 25న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద డబుల్ బెడ్ రూమ్ లబ్ది దారుల కోసం మహా ధర్నా చేపడతామని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమాలను ఎండగట్టిన కిషన్ రెడ్డి.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక బుల్డోజర్ ప్రభుత్వాన్ని తీసుకొస్తామని అన్నారు. పార్టీలో కష్టపడి పనిచేస్తే అవకాశాలు అవే వస్తాయని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కుటుంబ పార్టీలని విమర్శించారు. కుటుంబ పార్టీలకు కాలం చెల్లిందని చెప్పుకొచ్చారు. కల్వకుంట్ల కుటుంబాన్ని గద్దె దించడమే బీజేపీ లక్ష్యమని వ్యాఖ్యానించారు.