Bodh MLA Rathod Bapu Rao : బీఆర్ఎస్‌కు మరో ఎమ్మెల్యే గుడ్‌బై.. కాంగ్రెస్ చేరతానన్న బాపురావు
మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బాటలో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తను బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు సోమవారం ప్రకటించారు. త్వరలో కాంగ్రెస్ కుండువా కప్పుకుంటానని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ బాపురావుకు టికెట్ నిరాకరించి అనిల్ జాదవ్‌కు కేటాయించడం తెలిసిందే. టికెట్ దక్కకపోయినా కేసీఆర్ ఎంటే ఉంటానని చెబుతూ వస్తున్న బాపురావు ప్లేటు ఫిరాయించారు.
టికెట్ ఇవ్వనప్పుడు పార్టీలో ఉండడం గౌరవం కాదని, వేరే పార్టీలో చేరాలని ఆయన కొన్ని రోజులుగా అనుచరులతో మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది. పార్టీతో ఒక్కసారిగా తెగతెంపులు చేసుకోవడం ఇష్టంలేక సందిగ్ధానికి గురయ్యారని, మంత్రి కేటీఆర్‌తో మాట్లాడేందుకు అపాయింట్‌మెంట్ కోరారని సమచారం. అయితే కేటీఆర్ స్పందించకపోవడం, అభ్యర్థుల జాబితాలో మార్పుచేర్పులు ఉండవని తెలియడంతో ఆయన కాంగ్రెస్‌వైపు కన్నేసినట్లు తెలుస్తోంది. ఎంపీ పట్టభద్రుడైన బాపురావు 2014లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కాగా, తన కొడుక్కు టికెట్ ఇవ్వకపోవడంతో మైనంపల్లి హనుమంత రావు కూడా బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. బీఆర్ఎస్ ఆయనకు టికెట్ ఇచ్చినా కొడుక్కు మెదక్ టికెట్ కావాలని ఆయన పట్టుబట్టారు.