హమాలీ కూతురు హేమలత.. ఎస్సై ఉద్యోగానికి ఎంపిక

Update: 2023-08-08 05:25 GMT

తండ్రి హమాలీ కూలీ. తల్లి సాధారణ గృహిణి.. రోజూ పనులు చేస్తేనే గడవని పేద కుటుంబం అది. తల్లిదండ్రుల కష్టాలను చూస్తూ పెరిగిన ఆ అమ్మాయి.. తనకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. ఉన్నత ఉద్యోగానికి ఎంపికై కన్నవారి కలలను నిజం చేశారు. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూనే గ్రూప్ -1 కు సిద్ధమయ్యారు. తొలిప్రయత్నంలోనే ఎస్ఐగా ఎంపికై.. లక్ష్యానికి పేదరికం అడ్డురాదని నిరూపించారు. ఆమెపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.

మహబూబ్ బాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఓటాయి గ్రామానికి చెందిన కుమారస్వామి-పద్మ దంపతుల కూతురు బొల్లబోయిన హేమలత. ఇటీవల ప్రకటించిన ఎస్ఐ ఫలితాల్లో ఆమె ఉత్తమ ప్రతిభ కనబరిచి సివిల్ ఎస్ఐగా ఎంపికయ్యారు. తండ్రి కుమారస్వామి హమాలీ కూలిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆమెకు ఓ సోదురుడు, సోదరి ఉన్నారు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల కష్టాలు చూస్తూ పెరిగిన హేమలత.. పదో తరగతి వరకు గ్రామంలోనే చదివారు. తరువాత నర్సంపేటలో ఇంటర్ మీడియట్ పూర్తి చేశారు. మళ్లీ కొంత కాలం తరువాత ఓపెన్ లో డిగ్రీ పూర్తి చేశారు.

చదువుకుంటూనే తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలిచేవారు. ఈ క్రమంలోనే చెల్లెలు పెళ్లి చేసింది. అయితే ఆమె మాత్రం జీవితంలో తన లక్ష్యం నెరవేరే వరకు పెళ్లి చేసుకోకూడదని భావించింది. అందుకే డిగ్రీ పూర్తయిన తరువాత ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదివారు. అప్పటి నుంచి గ్రూప్ -1కు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఎస్ఐ ఉద్యోగాల కోసం తెలంగాణ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయడంతో దానికి సిద్ధమయ్యారు. మొదటి ప్రయత్నంలోనే సివిల్ ఎస్ఐగా ఎంపికయ్యారు. ఆమె విజయంపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్ష్యం వ్యక్తం చేశారు.ప్రస్తుతం వచ్చిన ఎస్ఐ జాబ్ తో తృప్తి పడకుండా గ్రూప్-1 కు ప్రిపేర్ అవుతానని హేమలత చెప్పారు. ఐపీఎస్ కావడతమే తన జీవితాశయమని పేర్కొన్నారు.



Tags:    

Similar News