నేడే BRS ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా.. ఆ 11 మందిలో టెన్షన్!!

Update: 2023-08-21 03:28 GMT

ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నికలకకు సమాయత్తమయ్యారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ఇవాళ విడుద‌ల చేయ‌నున్నార‌నే ప్రచారం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇవాళ పంచమి తిథి కావడంతో అభ్యర్థుల ప్రకటనకు ఇదే శుభముహూర్తంగా సీఎం నిర్ణయించినట్లు సమాచారం. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య సీఎం తొలి జాబితా విడుదల చేస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 2018 ఎన్నికల సమయంలో ఒకేసారి 105 మందితో మొదటి జాబితా ప్రకటించగా.. ఈసారి కూడా 87 మందితో తొలి జాబితా ఉంటుందని ప్రచారం జరగుతోంది.

తెలంగాణ అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌కు 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సొంతంగా 88 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన విజయవంతమైన ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో ఆ పార్టీ బలం 103కు చేరుకుంది. ఈసారి 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వడానికి కేసీఆర్ ఇష్టపడటం లేదని సమాచారం. ఆదిలాబాద్‌లో నలుగురు, కరీంనగర్‌లో ఇద్దరికి, ఖమ్మంలో ఇద్దరికి, వరంగల్‌లో ఇద్దరికి, జీహెచ్‌ఎంసీలో ఒకరికి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్‌ ఇవ్వడం సీఎం కేసీఆర్‌కు ఇష్టం లేదన్న ప్రచారం సాగుతోంది.

ఆసిఫాబాద్‌లో కోవాలక్ష్మికి టికెట్ ఇచ్చి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కును ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేయాలని.. బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం భావిస్తోంది. ఖానాపూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ బదులు.. భూక్యా జాన్సన్ నాయక్‌కు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. బోథ్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే బాపూరావు రాథోడ్ స్థానంలో అనిల్ జాదవ్ లేదా నగేశ్‌లకు అవకాశం ఇవ్వొచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వేములవాడలో పౌరసత్వం వివాదం ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ బదులుగా రెండేళ్ల క్రితం పార్టీలో చేరిన.. చల్మెడ లక్ష్మీ నరసింహరావుకు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. స్టేషన్‌ ఘన్‌పూర్‌లో రాజయ్య బదులుగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, జనగామలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బదులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని బరిలోకి దించే అవకాశం కనిపిస్తోంది. ఉప్పల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాశ్‌రెడ్డి స్థానంలో బండారి లక్ష్మారెడ్డికి అవకాశం ఇస్తారని.. పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. వైరాలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ బదులు మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌కు ఇవ్వాలని భావిస్తున్నారు. దుబ్బాక నుంచి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని పోటీకి దించాలని బీఆర్‌ఎస్ నాయకత్వం నిర్ణయించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యుడు సాయన్న మరణించినందున ఆయన కుమార్తె లాస్య నందితవైపు అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. గోషామహల్ నుంచి గత ఎన్నికల్లో ప్రేం సింగ్ రాథోడ్ పోటీ చేయగా.. ఈసారి నియోజకవర్గం ఇంఛార్జీ నందకిషోర్ వ్యాస్‌కు అవకాశమిచ్చే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది.





Tags:    

Similar News