నేటి నుంచి బీఆర్ఎస్ అసెంబ్లీ నేతల భేటీలు

Update: 2024-01-27 02:35 GMT

లోక్ సభ ఎన్నికల కసరత్తులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గస్థాయి విస్తృతస్థాయి సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే 17 లోక్ సభ నియోజకవర్గాల్లో సమావేశాలు పూర్తయ్యాయి. వాటికి కొనసాగింపుగా ఇవాళ్టి నుంచి వచ్చే నెల పదో తేదీ వరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు జరగనున్నాయి. స్థానిక శాసనసభ్యులు, నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తారు.రాష్ట్ర పార్టీ తరపున ప్రతినిధులు సమావేశాలకు ప్రత్యేక అతిథులుగా హాజరు కానున్నారు. ఇటీవలి శానససభ ఎన్నికలకు సంబంధించిన సమీక్షతో పాటు స్థానికంగా క్షేత్రస్థాయిలో ఉన్న అంశాలపై ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చించనున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అనుసరించాల్సిన కార్యాచరణపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.

లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ పటిష్ఠతకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నాయకులు, కార్యకర్తల సలహాలు, సూచనలను స్వీకరిస్తారు. పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరిస్తారు. ఈ సమావేశాలకు పార్టీ శ్రేణులనుంచి అద్భుతమైన స్పందన రావడం, వారిలోని ఉత్సాహాన్ని చూసిన పార్టీ నాయకత్వం దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీ నియోజకవర్గస్థాయిలోనూ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి, వాటిని క్రోడీకరించి పార్టీ అధినేత కేసీఆర్‌కు నివేదించనున్నారు. మొదటి రోజైన ఇవాళ సిద్దిపేట, బోథ్, జూబ్లీహిల్స్, వనపర్తి, నల్గొండ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. అటు మైనార్టీ నేతలతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇవాళ హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

Tags:    

Similar News