Dubbak Bandh: ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడి.. దుబ్బాకలో కొనసాగుతున్న బంద్
మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడికి నిరసనగా సిద్దిపేట జిల్లా, దుబ్బాకలో సోమవారం బంద్ నిర్వహిస్తున్నారు. దుకాణాలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసేశారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఉదయం 11 గంటల నుంచి నియోజకవర్గంలోని మండల కేంద్రాలు, గ్రామాల్లో నల్లజెండాలతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు, అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా నిన్న రాత్రి నుంచే దుబ్బాకలోని దుకాణాలకు బంద్ పోస్టర్లు అతికించారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. రాయపోల్, దుబ్బాక, తోగుట, దౌల్తాబాద్, మిరుదొడ్డి, చేగుంట, నార్సింగి, అక్బర్ పేట, భూంపల్లి మండలాల్లో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. దుబ్బాక బీజేపీ ఎంపీ రఘునందన్ రావు దిష్టిబొమ్మను దహనం చేశారు. కాగా బంద్ ప్రశాంతంగానే కొనసాగుతుంది.