పోటాపోటీగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించనున్న BRS, BJP, కాంగ్రెస్

Update: 2023-06-02 02:26 GMT

తెలంగాణ స్వప్నం సాకారమై తొమ్మిది వసంతాలు పూర్తవుతోంది. పదో వసంతంలోకి అడుగుడితోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ.. ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా ప్రత్యేక రాష్ట్రానికై పాటుపడ్డ బీఆర్ఎస్ ఈ దశాబ్ధి వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. తొమిదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని చాటేలా ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామగ్రామాన 21 రోజుల పాటు రోజుకొక రంగానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. నేడు సచివాలయం వేదికగా వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు.

రాష్ట్ర పదో ఆవిర్భావ వేడుకల సందర్భంగా టీపీసీసీ వినూత్న పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా 20 రోజుల పాటు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నారు. తెలంగాణను ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీయే అంటున్న టీ కాంగ్రెస్ నేతలు... నేడు సోనియా గాంధీ చిత్రపాటానికి పాలాభిషేకం చేయడానికి రెడీ అయ్యారు. ముఖ్య అతిథిగా లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ పాల్గొననున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ వచ్చిన మీరా కుమార్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పలువరు మాజీ ఎంపీలు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. యూపీఏ సర్కారు తెలంగాణ ఇచ్చిన సమయంలో మీరా కుమార్ లోక్ సభ స్పీకర్ గా ఉన్నారు. ఉదయం 10.30 గంటలకు గాంధీ భవన్ లో జాతీయ పతాక ఆవిష్కరణ ఉంటుంది. ఉదయం 11.00 గంటలకు గన్ పార్క్ వద్ద అమరవీరులకు లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నివాళులు అర్పిస్తారు. ఉదయం 11.15 గంటలకు నిజాం కాలేజ్ వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. ఈ పాదయాత్రను మీరా కుమార్ ప్రారంభిస్తారు. ఈ పాదయాత్ర అబిడ్స్ నెహ్రూ విగ్రహం మీదుగా గాంధీభవన్ కు చేరుకుంటుంది. అనంతరం గాంధీ భవన్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సభ ఉంటుంది. ఏఐసీసీ ఇన్‌చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ సీనియర్ నాయకులు పాల్గొంటారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ప్రముఖులను సన్మానిస్తారు.

ఓవైపు బీఆర్ఎస్.. మరోవైపు కాంగ్రెస్ తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు నిర్వహిస్తుంటే… తాము సైతం అన్నట్లు కేంద్ర సర్కార్ తరఫున అవతరణ దినోత్సవం జరుపుతోంది బీజేపీ. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈరోజు గోల్కొండ కోటలో జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు కేంద్రం మంత్రి కిషన్‌ రెడ్డి. తెలంగాణ సాధనలో బీజేపీ తెలంగాణ గుండెచప్పుడయ్యిందని అంతకుముందు మంత్రి గుర్తు చేసుకున్నారు. సుష్మ స్వరాజ్ తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమానికి బీజేపీ ముందుండి నడిచిందన్నారు. చారిత్రక కట్టడం గోల్కొండలో జరిగే ఈ వేడుకలకు గవర్నర్ తమిళిసై హాజరుకానున్నారు. పలు సాంస్కృతిక కార్యాక్రమాలు సహా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాలు ఉంటాయి. ప్రజలంతా తరలివచ్చి వేడుకల్లో పాల్గొనాలని అయన కోరారు. మోడీ తొమ్మిదేళ్ళ పాలనకు సంబంధించి పోటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇక సాయంత్రం భారత సాంస్కృతిక వైభవంతో పాటు కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలపై రెండు చిత్రాల ప్రదర్శన ఉంటుంది. 

Tags:    

Similar News