BRS PARTY: 15న బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫామ్.. మేనిఫెస్టో విడుదల..
తెలంగాణ ఎన్నికల నగారా మోగడంతో బీఆర్ఎస్ జోరు పెంచింది. పులి త్వరలోనే బయటకు వస్తుందని మంత్రి కేటీఆర్ కామెంట్ చేసిన కాసేపటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ షెడ్యూల్ బయటకు వచ్చింది. ఈ నెల 15న హుస్నాబాద్ వేదికగా ఆయన ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. అదే రోజున పార్టీ అభ్యర్థులకు బీ ఫామ్ ఇవ్వనున్నారు.
అభ్యర్థులకు బీ ఫామ్
అక్టోబర్ 15న సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థులతో తెలంగాణ భవన్ లో సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభంకానున్న ఈ భేటీలో అభ్యర్థులకు దిశా నిర్దేశం చేయనున్నారు. మేనిఫెస్టోలోని అంశాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న అంశంపై అభ్యర్థులకు సూచనలు చేయనున్నారు. మీటింగ్ అనంతరం కేసీఆర్ పార్టీ తరఫున బరిలో నిలిచేవారందరికీ బీ ఫామ్ అందజేయనున్నారు. 16న వరంగల్ లో జరిగే బహిరంగ సభలో మేనిఫెస్టో విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే 15న తెలంగాణ భవన్లోనే కేసీఆర్ బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. మేనిఫెస్టో రిలీజ్ చేసిన అనంతరం హుస్నాబాద్లో నిర్వహించే సభలో కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.
నియోజకవర్గాల పర్యటన
ఇదిలా ఉంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 15 నుంచి 18 వరకు నియోజకవర్గాల పర్యటనల్లో పర్యటించనున్నారు. 15న హుస్నాబాద్ సభలో పాల్గొననున్న ఆయన.. 16న జనగాం, భువనగిరి జిల్లాల్లో పర్యటించనున్నారు. 17న సిద్ధిపేట, సిరిసిల్ల, 18న జడ్చర్ల, మేడ్చల్ నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో పాల్గొంటారు.
నవంబర్ 9న కేసీఆర్ తాను పోటీ చేయనున్న రెండు స్థానాల్లో నామినేషన్ వేయనున్నారు. ఆ రోడు ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం కేసీఆర్ గజ్వేల్లో మొదటి నామినేషన్ వేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో రెండో నామినేషన్ దాఖలు చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు కామారెడ్డిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.