అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అధికార బీఆర్‌ఎస్ లో జోష్ మరింత పెరిగింది. అన్ని పార్టీల కన్నా ముందే అభ్యర్థుల్ని ప్రకటించిన సీఎం కేసీర్ వారి ఆదివారం బీ ఫామ్ లు అందజేయనున్నారు. దీంతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.
తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం 12:15 గంటలకు సీఎం కేసీఆర్ 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నారు. ఇందులో పలు ప్రజాకర్షక పథకాలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. రైతు బంధు, ఆసరా పింఛన్లు పథకం కింద ఇస్తున్న మొత్తాన్ని పెంచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ల మొత్తాన్ని పెంపు, రైతులందరికీ పింఛన్ ఇచ్చే ప్రతిపాదనను సైతం మేనిఫెస్టోలో చేర్చినట్లు సమాచారం.
ఇక, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ తేదీకి ఐదు రోజుల ముందు మాత్రమే బీఆర్‌ఎస్ పార్టీ తన మేనిఫెస్టోను ప్రకటించింది. అయితే, చాలా తక్కువ వ్యవధి కారణంగా మేనిఫెస్టోలోని అంశాలను ప్రజల్లోకి సరిగా తీసుకెళ్లలేకపోయినట్లు ఆ తర్వాత పార్టీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఈసారి వీలైనంత త్వరగా మేనిఫెస్టో విడుదల చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.