BRS Secret Meeting: గజ్వేల్లో బీఆర్ఎస్ అసంతృప్త నేతల సీక్రెట్ మీటింగ్
గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అసంతృప్త నాయకులు రహస్యంగా సమావేశమయ్యారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సీఎం సొంత నియోజకవర్గమైన గజ్వేల్ సమీపంలోని రిమ్మనగూడ గ్రామంలో గజ్వేల్ మున్సిపల్ మాజీ ఛైర్మన్ భాస్కర్ ఫాం హౌస్లో ఈ మీటింగ్ జరిగింది. ఇందులో వంద మందికి పైగా బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వారంతా బీఆర్ఎస్ శ్రేణులకు ఎదురవుతున్న సమస్యలపై చర్చించినట్లు సమాచారం.
ఉద్యమ సమయం నుంచి బీఆర్ఎస్ పార్టీ కోసం శక్తి వంచన లేకుండా కృషి చేసి కేసీఆర్ను రెండుసార్లు గెలిపించుకున్నా తమను పట్టించుకోలేదని నేతలు వాపోయినట్లు తెలుస్తోంది. తమ సమస్యలను చెప్పుకునేందుకు ఎన్నిసార్లు కేసీఆర్ అపాయింట్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని అభిప్రాయపడ్డారు. జిల్లా మంత్రి హరీష్ రావ్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని, పదేండ్లుగా అధికారంలో ఉన్నా పార్టీ కొరకు కష్టపడ్డ తమకు ఎలాంటి గౌరవం దక్కలేదని నాయకులు ఆవేదన వ్యక్తి చేసినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండదని అర్థమైందని, అందుకే ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలన్న దానిపై ఈ నెల 18న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని బీఆర్ఎస్ అసంతృప్త నేతలు స్పష్టం చేశారు.