టికెట్ ఇవ్వకపోతే వెళ్లిపోతా..కేసీఆర్కు తీగల కృష్ణా రెడ్డి అల్టిమేటం

Update: 2023-06-28 06:13 GMT

తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఎన్నికల దగ్గరపడుతున్నా అధికార పార్టీలోని కొద్దీ అసంతృప్తులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావు ఇప్పటికే హస్తం గూటికి చేరారు. తాజాగా మరికొంతమంది నేతలు బీఆర్ఎస్ లో టికెట్ కన్పార్మ్ కాకపోతే బయటకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే, హైదరాబాద్‌ మాజీ మేయర్‌ తీగల కృష్ణారెడ్డి పార్టీ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.

వచ్చే ఎన్నికల్లో తనకు మహేశ్వరం టికెట్ ఇవ్వకుంటే బీఆర్‌ఎస్‌ను వీడడం ఖాయమని తీగల స్పష్టం చేశారు. ‘‘మా కోడలు అనితారెడ్డి రంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్‌గా ఉంది. అందుకే ఒకే ఇంట్లో రెండు పదవులు కుదరవన్నట్లు మాట్లాడుతున్నారు. తిరిగి మేం కూడా విమర్శిస్తే బాగుండదు. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన సబితారెడ్డిని పార్టీలోకి తీసుకొని సీఎం కేసీఆర్‌ తప్పుచేశారు. నేను కేసీఆర్‌తో సమానంగా రాజకీయాల్లో ఉన్నా’’ అని అన్నారు.

అంతేకాకుండా ‘‘ఉద్యమంలో పనిచేసిన సీనియర్‌ నాయకులు చాలామంది పార్టీని వీడుతున్నారు. కేసీఆర్ వారందర్నీ పిలిపించి మాట్లాడాలి. లేకుంటే మా దారి మేం చూసుకుంటాం’’ అని తీగల కృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి తనను ఎవరూ సంప్రదించలేదని వివరించారు.

Tags:    

Similar News