KCR : నేడు నల్గొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ...హాజరుకానున్న మాజీ సీఎం కేసీఆర్

Update: 2024-02-13 02:20 GMT

కృష్ణా జలాలపై తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. కృష్ణా జలాలు సాధించడంతో మీరు కారణమంటే..మీరు కారణమంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు మాటల యుద్ధానికి దిగారు. ఇదే అంశంపై ఇరు పార్టీలు పోటా పోటీగా సభలు, ధర్నాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ సభ పేరుతో బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. అటు అధికార కాంగ్రెస్‌ కూడా పోటీ సభను నిర్వహించేందుకు సన్నద్ధం అవుతోంది. జిల్లా కేంద్ర సమీపంలోని నార్కట్‌పల్లి- అద్దంకి హైవేని ఆనుకొని ఉన్న చర్లపల్లి బైపాస్‌ రోడ్డులో సుమారు 50 ఎకరాల్లో బీఆర్‌ఎస్‌ బహిరంగసభ నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు.

బీఆర్ఎస్ సభా ఏర్పాట్లను మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కృష్ణాజలాల్లో తెలంగాణ హక్కుల కోసం, ప్రాజెక్టుల కోసం తాము చేసిన పోరాటాలు, ఉద్యమాలను కేసీఆర్ ప్రసంగించనున్నారు. కేంద్రం చేతికి తెలంగాణ ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు వెళ్లకుండా ఏం చేశారో చెప్పే అవకాశం ఉంది. అటు ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగంతో పాటు చుట్టూ పక్కన ఉన్న ఖమ్మం, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల నుంచి బీఆర్‌ఎస్‌ శ్రేణులు, కార్యకర్తలు సభకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. అయితే ముఖ్యమంత్రి పదవి తర్వాత గులాబీ బాస్ బహిరంగ సహలో మాట్లాడడం ఇదే తొలిసారి. అటు నల్గొండలో బీఆర్ఎస్ కు పోటీగా కాంగ్రెస్ కూడా నిరసన కార్యక్రమం చేపట్టనుంది. ఇలా..ఇరు పక్షాల నేతలు ఒకే రోజు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో ఏం జరుగుతుందా అని జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Tags:    

Similar News