Khanapur MLA Rekha Naik : మొదలైన అసంతృప్తుల సెగ.. కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే

Update: 2023-08-22 01:53 GMT

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తమ పార్టీ అభ్యర్థుల భారీ లిస్టును ఒకేసారి రిలీజ్ చెయ్యడంతో.. చాలా మంది ఆశావహ నేతల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. తొలి జాబితాలోనే ఏకంగా 115 మంది అభ్యర్థులకు (BRS MLA Candidates List 2023) టికెట్లు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ జాబితాలో మొత్తం 9 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చోటు దక్కలేదు. అందులో ఎనిమిది చోట్ల కొత్తవారికి అవకాశమివ్వగా, ఒక్క నియోజకవర్గంలో మాత్రం ఆ ఎమ్మెల్యే వారసుడికే టికెట్ ప్రకటించారు సీఎం కేసీఆర్. దాగుడుమూతలు లేకుండా.. ఆ 8 మందికి ఒక్కసారిగా క్లారిటీ వచ్చేసింది. ఇక వాళ్లు తమ పొలిటికల్ కెరీర్‌ని బీఆర్ఎస్‌లో కొనసాగించలేము అని ఫిక్స్ అయిపోతూ.. ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. ఈ లిస్టులో రేఖానాయక్ దంపతులు ముందున్నారు.

ఖానాపూర్ నియోజవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ను కాదని ఆ సీటును భూక్య జాన్సన్‌ రాథోడ్‌ నాయక్‌కు ఇచ్చారు సీఎం కేసీఆర్. సీటు కోల్పవడంతో రేఖా నాయక్‌ భర్త శ్యామ్‌ నాయక్‌ ఆ వెంటనే (సోమవారం)సాయంత్రానికే కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌ రెడ్డి నివాసంలో ఆయన్ను కలిసి కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు ప్రకటించారు. పార్టీ కండువా కప్పి శ్యామ్​ నాయక్​ను పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ . ఇక ఈ రోజు రేఖానాయక్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా నడుస్తోంది.

ఇవాళ రేఖా నాయక్ కాంగ్రెస్‌లో చేరితే.. ఆమె హస్తం టికెట్ ఆశించే అవకాశం ఉంది. ఆమెకు టికెట్ ఇస్తామనే హామీ ఇవ్వడం వల్లే.. ఆమె కాంగ్రెస్‌లో చేరుతున్నారని తెలుస్తోంది. ఐతే.. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ప్రతీ నియోజకవర్గానికీ.. భారీగా ఆశావహులు ఉన్నారు. అలాంటి సమయంలో.. కొత్తగా పార్టీలో చేరేవారికి టికెట్లు ఇస్తే.. ఆల్రెడీ ఉన్నవారు రెబెల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇది కాంగ్రెస్‌కి పెద్ద సమస్య అయ్యే అవకాశముంది. మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కూడా కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. అలాగే మాజీ ఎమ్మల్యే వేముల వీరేశం కూడా హస్తం గూటికి చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలా ఈ లిస్టు క్రమంగా పెరిగే అవకాశం ఉంది. ఐతే.. కాంగ్రెస్ పార్టీ ఈ నెల 25లోపే ఆశావాహ అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవాలని సూచించింది. ఆలోగా చేరికలు జరగాల్సి ఉంటుంది.


Tags:    

Similar News