నాకు హామీ ఇచ్చి.. వేరే అభ్యర్థికి బీ ఫాం ఇచ్చారు.. సి.కృష్ణాయాదవ్
బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి సి.కృష్ణాయాదవ్ శనివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ.. . ఆత్మాభిమానాన్ని చంపుకొని బీఆర్‌ఎస్‌లో ఉండలేనని, అందుకే రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ‘అంబర్‌పేట టికెట్ ఇస్తామని 2018లో కేసీఆర్ హామీ ఇచ్చి.. వేరే అభ్యర్థికి బీ ఫాం ఇచ్చారు. అయినా పార్టీలోనే ఉన్నా. కానీ, ఈసారి కూడా ఇవ్వలేదు. ఆ పార్టీ బీసీల వ్యతిరేక పార్టీ అని అర్థమైంది. భూస్వాములకు, పెత్తందారులకు, పారిశ్రామికవేత్తలకు అవకాశం కల్పించే పార్టీలో ఒక బీసీ నాయకుడిగా కొనసాగడం సరికాదనే నిర్ణయానికి వచ్చి పార్టీకి రాజీనామా చేస్తున్నా’ అని తెలిపారు. ఏ పార్టీ బీసీలకు అవకాశం కల్పిస్తుందో అందులో చేరతానన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సమక్షంలో కృష్ణాయాదవ్ బీజేపీలో చేరతారని సమాచారం. అంబర్‌పేట నియోజకవర్గం టికెట్ ఇస్తామని బీజేపీ ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలిసింది.
కేసీఆర్ పిలుపు మేరకు తెలుగురాష్ట్రాలు విడిపోయాక జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ పార్టీలో క్రియాశీలక సభ్యునిగా పార్టీలో చేరారు సి.కృష్ణాయాదవ్. ఏ బాధ్యత అప్పజెప్పినా తన వంతు బంగారు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వంలో ఒక సైనికుడిగా పనిచేయడానికి సిద్దంగా ఉన్నానని చెప్పి చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో చివరి నిమిషంలో తనకు టికెట్ రాకున్నా రెబల్ అభ్యర్థిగా మారకుండా అంబర్పేట్ నుంచి బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డిని ఓడించి టీఆర్‌ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ గెలుపుకు కీలక పాత్ర పోషించారు. అయితే.. రెండవసారి కూడా బీఆర్ఎస్ టికెట్ వస్తుందేమోనని ఆఖరి నిమిషం వరకూ వేచి చూసిన ఆయన.. అధిష్టానం ఇవ్వకపోవడంతో ఈ నెల 30న బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.