పాటలతో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన సాయిచంద్

'ధూంధాం'లతో ఎనలేని గుర్తింపు;

Update: 2023-06-29 01:58 GMT



తెలంగాణ ఉద్యమంలో తన ఆటపాటలతో కీలక పాత్ర పోషించిన ప్రముఖ గాయకుడు, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్(39) హఠాన్మరణంతో ప్రముఖులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమంలో తనదైన శైలిలో ప్రజలను చైతన్యవంతులను చేసిన సాయిచంద్ గొంతు మూగబోయిందనే వార్తను రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. లక్షలాదిమంది పాల్గొన్న బహిరంగ సభలను ప్రజలను ఆకట్టుకునే విధంగా తన గొంతుకను వినిపించి సభలో పాల్గొన్న వారిని అలరించడంలో సాయి చంద్ ది అందవేసిన గొంతుక అని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తదితరులు పాల్గొనే భారీ బహిరంగ సభలు రాష్ట్రంలో ఎక్కడ నిర్వహించినా ఆయన పాల్గొనేవారు. ప్రధానంగా సీఎం కేసీఆర్ పాల్గొనే చాలా సభల్లో.. సాయిచంద్ తన గానంతో, అద్భుతమైన వ్యాఖ్యానంతో ముఖ్యమంత్రిని వేదికపైకి ఆహ్వానించేవారు. సమావేశానికి హాజరైన ప్రజలను ఉత్సాహపరిచేవారు.

1984 సెప్టెంబర్‌ 20న వనపర్తి జిల్లా అమరచింతలో జన్మించిన సాయిచంద్‌.. పీజీ వరకు చదువుకున్నాడు. సాయచంద్ తండ్రి వెంకట్రాములు కూడా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో కళాకారుడే. అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి. సాయిచంద్ కూడా తన తండ్రిలాగే ప్రజా సమస్యలపై పాటలు రాస్తూ, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ప్రజలను తన పాటలతో చైతన్యం చేసేవాడు. విద్యార్థి దశ నుంచే.. తెలంగాణ అమరవీరుల మీద పాటలు రాసి పాడుతూ.. విప్లవ ఉద్యమంలో పాత్ర వహించేవాడు. తన పాటలతో న్యూడెమోక్రసీ పార్టీ ద్వారా వెలుగులోకి వచ్చి.. ఆ తర్వాత విద్యార్థి దశలోనే పీడీఎస్‌యూ రాష్ట్ర కమిటీ వరకు ఎదిగాడు

మలిదశ తెలంగాణ ఉద్యమంలో ధూంధాం కార్యక్రమాలతో ప్రజలను చైతన్య పరిచారు. ఇప్పటివరకు అనేక పాటలు పాడారు. అందులో ముఖ్యంగా మిట్టపల్లి సురేందర్ రాసిన ‘రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా’ పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య రజని కూడా తెలంగాణ ఉద్యమ కళాకారిణే. ఇద్దరి అభిప్రాయాలు ఒకటే కావడం వల్లే.. ప్రేమించి కులాంతర వివాహాం చేసుకున్నారు. రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం తెలంగాణ సాధించిన ప్రగతిని, ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను తన పాటలతో చాటిచెప్పారు. ఆనాటి నుండే టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ ప్రభుత్వ పథకాలను తన ఆట పాటలతో ప్రజలోకి తీసుకువెళ్లారు. 2021, డిసెంబర్‌లో సాయిచంద్‌ను తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించింది.

Tags:    

Similar News