Harish Rao: ప్రాజెక్టులు అప్పగించింది మేము కాదు.. వాళ్లే: హరీష్ రావు

Byline :  Veerendra Prasad
Update: 2024-02-05 10:30 GMT

తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ నేతలు తమపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ అగ్ర నేత హరీష్ రావు. గత పదేళ్ల పాలనలో కేసీఆర్.. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించలేదని, కానీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే రేవంత్ సర్కార్ ప్రాజెక్టులు అప్పగించిందన్నారు. ఢిల్లీకి ప్రాజెక్టులు అప్పగించి తెలంగాణను అడుక్కునే స్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. రాజకీయాలు కాదు.. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని, తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగేలా వ్యవహరించవద్దని సూచించారు.

సోమవారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఢిల్లీలో కేఆర్ఎంబీ సమావేశం జరిగిందని, నెలరోజుల్లో 15 అవుట్‌లెట్స్‌ను అప్పగిస్తామని మీటింగ్ లో అంగీకరించారన్నారు. ప్రభుత్వం అంగీకరించినట్లు మీటింగ్ మినిట్స్ లో ఉందన్నారు. ప్రాజెక్టులు అప్పగించేది లేదని కాంగ్రెస్ ప్రభుత్వం రంకెలేస్తుంది కానీ నీ కేఆర్ఎంబీ కి ప్రాజెక్టులు అప్పగిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని అన్నారు. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించారని పత్రికలు కూడా వార్తలు రాశాయని, ప్రాజెక్టులు అప్పగించింది నిజం కాకుంటే ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో వితండవాదం తప్ప మరేమీ లేదని అన్నారు. కేసీఆర్‌పై సీఎం వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని ఆక్షేపించారు.




Tags:    

Similar News