రాష్ట్రంలో సీఎం వర్సెస్ గవర్నర్ రచ్చ మళ్లీ మొదలైంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. అయితే ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ వర్గాలు మండిపడుతున్నాయి. ఈ అంశంపై స్పందించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తమిళనాడు బీజేపీ చీఫ్గా ఉన్న తమిళిసై గవర్నర్ గా నామినేట్ అయిన విషయాన్ని గుర్తు చేశారు. తమిళిసైకి గవర్నర్ గా కొనసాగే నైతిక హక్కు లేదని విమర్శించారు. తక్షణం ఆమె ఆ పదవి నుంచి వైదొలగాలని ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నవారేనని వారి అభ్యర్థిత్వాలను తిరస్కరించడం సరికాదని అన్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల విషయంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వైఖరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి మండిపడ్డారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించడం అప్రజాస్వామికం అని అన్నారు. ఏ ప్రతిపాదికన వీరిద్దరి అభ్యర్థిత్వాలను తిరస్కరించారో గవర్నర్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకించే అధికారం గవర్నర్‌కు లేదని మధుసూదనాచారి స్పష్టం చేశారు.