బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలనాపగ్గాలు చేపట్టకముందే ఆయన చేసిన కామెంట్లు హాట్ టాపిక్గా మారాయి. స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన కడియం విజయోత్సవ ర్యాలీలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాలేదని ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని అన్నారు.
ఆరు నెలలో లేదా ఏడాదో చెప్పలేంగానీ మళ్లీ మన ప్రభుత్వమే రాబోతుందని సంచలన వ్యాఖ్యలుచేశారు. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీకి మేజిక్ ఫిగర్ కన్నా నాలుగు సీట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయని, దాన్ని వారు కాపాడుకుంటారో లేదో చూద్దామని అన్నారు. ప్రజలు మార్పు కోరుకున్నారని అందుకే ప్రజాతీర్పును గౌరవిస్తామని స్పష్టం చేశారు. అయితే ఆర్నెళ్లలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ సీఎం అవుతారంటూ కడియం చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.