కాంగ్రెస్లోకి మల్లారెడ్డి.. మల్కాజ్గిరి ఎంపీగా ఛాన్స్..?

Byline :  Kiran
Update: 2024-01-20 15:35 GMT

రాజకీయాల్లో మల్లారెడ్డి రూటే సపరేటు. ఆయన మాటలే కాదు.. ఏం చేసినా సెన్సేషనే. సోషల్ మీడియాలో వైరల్ కావాల్సిందే. ప్రస్తుతం దుబాయ్ టూర్లో ఉన్న మల్లారెడ్డి హైదరాబాద్ తిరిగొచ్చాక మరో సంచలన ప్రకటన చేయనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. త్వరలోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. రాజకీయ భవిష్యత్తుతో పాటు వ్యక్తిగత కారణాలతో మల్లారెడ్డి కాంగ్రెస్ గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

స్వరం మార్చిన మల్లారెడ్డి

నిజానికి బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నాటి నుంచే మల్లారెడ్డి రూటు మారింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన సమావేశానికి మల్లారెడ్డి డుమ్మా కొట్టారు. మల్కాజ్గిరి లోక్సభ బీఆర్ఎస్ సన్నాహక సమావేశానికి సైతం ఆయన హాజరుకాలేదు. ముందే సమాచారం ఇచ్చినా హాజరుకాకపోవడంపై కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని ఏకిపారేసిన మల్లారెడ్డి.. ఆ తర్వాత స్వరం మార్చారు. కాంగ్రెస్కు మద్దతిచ్చేందుకు రెడీగా ఉన్నానంటూ దోస్తానాకు సిద్ధమయ్యారు. ఒకవైపు మనసులో మాట పరోక్షంగా బయటపెడుతూనే.. మరోవైపు తనపై కాంగ్రెస్లో చేరబోతున్నానంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మల్లారెడ్డి మండిపడ్డారు. కానీ అదే సమయంలో తెరవెనుక ప్రయత్నాలు మాత్రం కంటిన్యూ చేసినట్లు తెలుస్తోంది.

డీల్ కుదిరిన తర్వాతే..

కాంగ్రెస్ హైకమాండ్తో డీల్ ఓకే చేసుకున్న తర్వాతే మల్లారెడ్డి దుబాయ్ టూర్కు చెక్కేసినట్లు వినికిడి. అయితే పార్టీలో చేరేందుకు మల్లారెడ్డి కాంగ్రెస్ పెద్దల ముందు కొన్ని షరుతులు పెట్టినట్లు సమాచారం. తనకు మల్కాజ్గిరి ఎంపీ టికెట్, రాజీనామాతో ఖాళీ అయ్యే మేడ్చల్ అసెంబ్లీ టికెట్ తన కోడలికి ఇవ్వాలని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. ఆ డిమాండ్లకు కాంగ్రెస్ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే పార్టీ మార్పుకు అంగీకరించినట్లు అయితే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే ముందే మల్లారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిసైడయ్యారని టాక్ వినిపిస్తోంది.

షరతులకు కాంగ్రెస్ ఓకే..

ఇదిలా ఉంటే మల్లారెడ్డికి ఉన్న మాస్ ఇమేజ్, మనీ పవర్ లోక్ సభ ఎన్నికల్లో తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ భావిస్తోందట. ఆ కారణంగానే మల్లారెడ్డి షరతులన్నింటికీ పార్టీ హైకమాండ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పార్టీ మారడం వెనుక మల్లారెడ్డికి పెద్ద స్కెచ్ ఉంది. వేల కోట్ల విలువైన తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడంతో పాటు విద్యా సంస్థల భవిష్యత్ కోసమే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది. నిజానికి అధికారంలో ఉన్న పార్టీ పంచన చేరడం మల్లారెడ్డికి అలవాటే. 2014లో టీడీపీ ఎంపీగా ఎన్నికైన ఆయన.. 2016 జూన్లో బీఆర్ఎస్లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే బీఆర్ఎస్కు పార్టీ ఫండ్ రూపంలో భారీ మొత్తం కట్టబెట్టి ఆయన మంత్రి పదవి కొనుక్కున్నారని అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి.

వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్లో చేరాలని మల్లారెడ్డి భావించారు. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీపై, టీపీసీసీ చీఫ్ రేవంత్పై తాను చేసిన వ్యాఖ్యల కారణంగా అవకాశమివ్వకపోవచ్చన్న అనుమానంతో ఆగిపోయారట. ఇదే సమయంలో అసెంబ్లీ ఎలక్షన్ల మాదిరాగానే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాల్లో ప్రభంజనం సృష్టించాలన్న లక్ష్యంతో వ్యూహాలకు పదను పెడుతున్న కాంగ్రెస్.. మల్లారెడ్డికి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి ప్రపోజల్ వచ్చిన వెంటనే మల్లారెడ్డి మరో ఆలోచన లేకుండా పార్టీ మార్పుకు సిద్ధమయ్యారని సమాచారం

కౌన్సిలర్లతో కలిసి..

బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రకు పరిమితమవడంతో ఆ పార్టీలో కొనసాగితే వచ్చే ఫాయిదా ఏమీ ఉండదన్న విషయాన్ని మల్లారెడ్డి తన అనుచరుల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ ఆఫర్కు ఓకే చెప్పి దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తోంది. పనిలో పనిగా తన నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, మహిళా కౌన్సిలర్ల భర్తలను వెంట తీసుకెళ్లిన ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత వారితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Full View

Tags:    

Similar News