కడియం శ్రీహరి ఎస్సీ కాదు.. కులంపై చర్చ జరగాలి : బీఆర్ఎస్ ఎమ్మెల్యే

Update: 2023-07-09 16:55 GMT

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్లో ముసలం ముదురుతోంది. మొన్నటివరకు ఎమ్మెల్యే రాజయ్యపై సొంత పార్టీ సర్పంచ్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం సంచలన ఆరోపణలు చేసింది. కొన్నిరోజులుగా గొడవ కొద్దిగా సద్దుమణిగినా.. మళ్లీ రాజయ్య కామెంట్స్తో బీఆర్ఎస్లో లొల్లి షురూ అయ్యింది. కడియం శ్రీహరిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

కడియం శ్రీహరి కులం మీద చర్చ జరగాలని రాజయ్య అన్నారు. శ్రీహరి ఎస్సీ కాదు.. ఆయన తల్లి బీసీ అని అన్నారు. విద్య, ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లను శ్రీహరి దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అంతేకాకుండా తప్పుడు ధృవపత్రాలతో ఎమ్మెల్యే అయ్యారని విమర్శించారు. ఎమ్మెల్యే కాకముందు సరిగా ఇళ్లు కూడా లేని కడియంకు వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని నిలదీశారు.

నియోజకవర్గంలో దొంగచాటుగా సమావేశం పెట్టడం ఎందుకని.. దమ్ముంటే రచ్చబండ దగ్గర చర్చకు సిద్ధమా అని కడియం శ్రీహరికి రాజయ్య సవాల్ చేశారు. ఏ విషయంలోనైనా నువ్వు గొప్పో, నేను గొప్పో తేల్చుకుందాం రమ్మంటూ ఫైర్ అయ్యారు. . కడియం రంగులు మార్చే ఊసరవెల్లి అని.. ఎన్నికలప్పుడే ఆయన నియోజకవర్గంలో కనిపిస్తాడని విమర్శించారు.

కడియం ఎన్నికల్లో ఓడిపోయాక స్టేషన్‌ఘన్‌పూర్‌ను పట్టించుకోలేదని రాజయ్య ఆరోపించారు. కానీ స్టేషన్‌ ఘనపూర్‌ను తానే అభివృద్ధి చేశానని చెప్పుకోవడం విడ్డూరమని విమర్శించారు. కడియం శ్రీహరికి అహం ఎక్కువ.. ఆయన్ను దళిత దొర అని పిలుస్తారు అని వ్యాఖ్యానించారు. స్టేషన్ ఘనపూర్ నా గడ్డా - నా అడ్డా అని రాజయ్య స్పష్టం చేశారు.

Tags:    

Similar News