రేఖా నాయక్ ఔట్.. ఖానాపూర్ బరిలో కేటీఆర్ దోస్త్..!

Update: 2023-07-25 10:35 GMT

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ స్పీడ్ పెంచింది. రిజర్వ్డ్ స్థానాల్లో పనితీరు సరిగాలేని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సైతం షాక్ ఇచ్చేందుకు హైకమాండ్ సిద్ధమవుతోంది. విమర్శలు, ఆరోపణలున్న వివాదాస్పద ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడదని ఇప్పటికే నిర్ణయించిన సీఎం కేసీఆర్.. ఆయా సీట్లలో అభ్యర్థుల్ని మార్చేందుకు సిద్ధమయ్యారు. ఆయా నియోజకవర్గాలపై ఇప్పటికే కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఒక నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. ఈ లిస్టులో ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గం సైతం ఉందని బీఆర్ఎస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

2013లో బీఆర్ఎస్లో చేరిక

ఎస్టీ రిజర్వ్ స్థానమైన ఖానాపూర్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ నేత అజ్మీరా రేఖా నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009లో రాజకీయ అరంగేట్రం చేసిన ఆమె.. కాంగ్రెస్ తరఫున ఆసిఫాబాద్ జెడ్పీటీసీ సభ్యురాలిగా విజయం సాధించారు. 2013లో బీఆర్ఎస్లో చేరి ఉద్యమంలో పాల్గొన్నారు. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి రితేష్ రాథోడ్ పై 30వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్ పై 24,300 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

గిట్టనివారిపై కేసులు

ఇదిలా ఉంటే అజ్మీరా రేఖా నాయక్ నిత్యం వివాదాలతో సావాసం చేస్తున్నారు. తన వ్యవహారశైలితో సొంత పార్టీ నేతలు దూరమవుతున్నారు. గిట్టనివారిని కేసుల్లో ఇరికిస్తారని ఎమ్మెల్యే రేఖానాయక్‌పై ఆరోపణలున్నాయి. వాటిని నిజం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నేతలపైనే కేసులు పెట్టిన ఉదంతాలు ఉన్నాయి. ఎవరైనా తనను ప్రశ్నించినా, నిలదీసినా ఏ మాత్రం జీర్ణించుకోలేని రేఖా నాయక్.. వారిని దూరం పెట్టడం, కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేయడం, ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీస్తుండటంపై స్థానిక నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఆమె కారణంగా కొందరు పార్టీని సైతం వీడారు.

తెరపైకి రెండు పేర్లు

నిజానికి గత ఎన్నికల సమయంలోనే రేఖానాయక్‌పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆమెకు టికెట్ డౌటేనన్న ప్రచారం జరిగింది. అయితే కేటీఆర్ చొరవతో గట్టెక్కింది. అయినా ఆమె తీరు మార్చుకోలేదు. పార్టీ నేతలతో పాటు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఈసారి గెలవడం కష్టమేనన్న నిర్ణయానికి వచ్చిన అధిష్టానం ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో ఒకరు కేటీఆర్ బాల్యమిత్రుడు భూక్యా జాన్సన్ నాయక్ కాగా.. మరొకరు రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావుకు సన్నిహితుడిగా పేరున్న బాధావత్ పూర్ణ చందర్ నాయక్.

ఎంపీ సంతోష్ హామీతో

ఈసారి ఖానాపూర్ టికెట్ ఇప్పిస్తానని రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ పూర్ణ చందర్కు హామీ ఇచ్చినట్లు బీఆర్ఎస్ వర్గాల్లో గుసగుస వినిపిస్తోంది. ఈ క్రమంలోనే సంతోష్ కోటాలో తనకు ఖానాపూర్ టికెట్ వస్తుందని గంపెడాశతో ఉన్న పూర్ణ చందర్ క్యాడర్‌ను కూడగడుతున్నాడు. రెండేండ్లుగా నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం విస్తృతంగా పర్యటిస్తూ సేవాకార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ పై అసంతృప్తితో ఉన్న నాయకులు ఇతర పార్టీలతో జతకట్టకుండా చూడటంలో సక్సెస్ అయ్యాడన్న పేరుంది. దశాబ్దాలుగా స్థానికేతరులు పాగా వేయడంతో పూర్ణ చందర్ స్థానికత కూడా ఆయనకు కలిసొస్తుందని అందరూ భావించారు.

కేటీఆర్ ప్రోత్సాహంతో

పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నందున ఈసారి ఖానాపూర్ బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం పూర్ణచందర్కు పక్కా అన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే కేటీఆర్ మిత్రుడు, ఎన్నారై భూక్యా జాన్సన్ నాయక్ ఎంట్రీతో ఆయన ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. మంత్రి కేటీఆర్ ఈసారి ఖానాపూర్ నియోజకవర్గం నుంచి తన స్నేహితుడైన జాన్సన్ బరిలో దిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. కేటీఆర్ ఇప్పటికే పలు సమావేశాల్లో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ జాన్సన్ కు ఎలివేషన్ ఇచ్చారు. నిజానికి రాజకీయాలకు ఆమడదూరం పాటించే జాన్సన్కు ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టంలేదని, అయితే కేసీఆర్ బలవంతంతో పోటీకి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఖానాపూర్ టికెట్ ఖాయమని ప్రగతిభవన్ నుంచి సంకేతాలు అందడంతోనే జాన్సన్ నియోజకవర్గంలో యాక్టివ్ అయినట్లు పార్టీ వర్గాల్లో గుసగుస వినిపిస్తోంది.

కాంగ్రెస్తో టచ్

ఇదిలా ఉంటే పరిస్థితిని ముందుగానే పసిగట్టిన సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ తన ప్రయత్నాల్లో తాను ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బీఆర్ఎస్ టికెట్ నిరాకరిస్తే కాంగ్రెస్ గూటికి చేరేందుకు ఆమె ఇప్పటికే ప్లాన్ రెడీ చేసినట్లు సమాచారం. మరోవైపు ఖానాపూర్ నుంచి కాంగ్రెస్ తరఫున భరత్ చౌహాన్, బీజేపీ నుంచి రాథోడ్ రమేష్ బరిలో దిగే అవకాశముంది. ఒకవేళ జాన్సన్ను పోటీలో నిలిపితే స్థానికత అంశం తనకు ప్లస్ అవుతుందని కాంగ్రెస్ అభ్యర్థి భరత్ ఆశతో ఉన్నారు.



Tags:    

Similar News